కేసీఆర్‌కు కొత్త సమస్య.. దళిత బంధు అమలు సాధ్యమేనా.?

by  |
KCr
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక అయిన హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు స్కీంను అందరికీ వర్తింపజేయడం సాధ్యమేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే 17 వేల మంది అకౌంట్లలో డబ్బులు జమ చేసిన జిల్లా అధికార యంత్రాంగం మిగతా 7 వేల పైచిలుకు లబ్ధిదారులకు ఎన్నికలలోగా అకౌంట్లలో డబ్బులు చెల్లించడం సాధ్యమేనా.? లేదా అన్నది అనుమానంగానే ఉంది. ఎన్నికల నోటిఫికేషన్ అమలుకు ముందే లబ్ధిదారుల అకౌంట్లలో డబ్బులు జమ చేయాలన్న యోచనతో అధికార యంత్రాంగం పావులు కదుపుతోంది.

శిక్షణ ఎలా..?

దళిత బంధు స్కీం లబ్ధిదారులకు మంజూరు చేసిన రూ. 10 లక్షల నగదు ద్వారా వారు ఉపాధి పొందేందుకు అవసరమైన ప్రాసెస్‌ను కొనసాగించడం కూడా ఇబ్బందిగానే మారిందని చెప్పక తప్పదు. నోటిఫికేషన్‌కు ముందే ఈ పథకం అమలులో ఉన్నందున యథావిధిగా స్కీంను అమలు చేస్తామని జిల్లా అధికారులు ప్రకటించారు. అయితే లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న యూనిట్లపై వారికి శిక్షణ ఇచ్చే విధానానికి ఈసీ అనుమతి తీసుకోకతప్పదని తెలుస్తోంది.

కొత్తవారికి ఎలా..?

17 వేల మంది లబ్ధిదారుల అకౌంట్లలో రూ. 10 లక్షల చొప్పున నగదు జమ చేసిన అధికారులు మిగతా వారికి కూడా ఇదే విధానాన్ని అమలు చేయాల్సి ఉంది. అయితే బ్యాంకర్లు ఏక కాలంలో 7వేల పైచిలుకు అకౌంట్లను తీయడం, వారి ఖాతాల్లో డబ్బు జమ చేయడం సాధ్యం కాదన్న అభిప్రాయాన్నే వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఇప్పటికే అకౌంట్లలో జమ చేసిన లబ్ధిదారులకు యూనిట్లు కేటాయించే ప్రక్రియలో కూడా ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న యూనిట్లకు సంబంధించిన కొటేషన్లు, ఎంచుకున్న వ్యాపారానికి సంబంధించిన వ్యవహారాలు అన్ని సకాలంలో పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు. లబ్ధిదారులకు కేటాయించిన అకౌంట్లు లింక్ చేయడంతో స్టేజీల వారీగా నిధులు విడుదల చేసుకునే అవకాశం ఉండటం కూడా ఇబ్బందిగా మారినట్టు సమాచారం.

Next Story

Most Viewed