హుజురాబాద్‌లో టీఆర్‌ఎస్‌కు కొత్త తలనొప్పి.. నేతల్లో కలవరం

by  |
హుజురాబాద్‌లో టీఆర్‌ఎస్‌కు కొత్త తలనొప్పి.. నేతల్లో కలవరం
X

దిశ, హుజురాబాద్: 2019 లోక్‌సభ నిజామాబాద్ ఎన్నికల సీన్ హుజురాబాద్‌లో రిపీట్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రత్యక్ష పోరు తప్పదన్న నిర్ణయంతో ఫీల్డ్ అసిస్టెంట్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. నిజామాబాద్ లోకసభ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ కూతురు కవిత ఓటమిలో కీలక పాత్ర పోషించిన పసుపు రైతుల మాదిరిగానే.. హుజురాబాద్‌లో టీఆర్‌ఎస్‌తో అమితుమీకి సిద్దమవుతున్నారు ఉపాధి హామీ ఫిల్డ్ అసిస్టెంట్లు. సోమవారం హుజురాబాద్‌లోని వెంకట సాయి గార్డెన్‌లో ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం రాష్ట్రస్థాయి సమావేశం జరిగింది. ఈ మేరకు జరిగిన సమావేశంలో తెలంగాణ రాష్ట్ర జేఏసీ అధ్యక్షుడు ముదిగొండ శ్యామలయ్య మాట్లాడుతూ… ఇప్పటివరకు తాము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నోమార్లు వేడుకున్నా కనికరించడం లేదన్నారు.

16 నెలల క్రితం ఉద్యోగాల నుండి తీసేసిన తమను తిరిగి ఉద్యోగాల్లో తీసుకోవాలని వేడుకునేందుకు మొక్కని కాళ్లు లేవు, ఎక్కని గడప లేదన్నారు. రాష్ట్రంలో ఉపఎన్నికలు జరిగిన ప్రతిచోట కూడా తమను తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలన్న డిమాండ్‌ను ప్రభుత్వం ముందు ఉంచినా.. అప్పటివరకు తమను సంతృప్తి పరిచి ఉపఎన్నికల తరువాత విస్మరిస్తున్నారని మండిపడ్డారు. హుజురాబాద్ ఉపఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే నాటికే తిరిగి తమను విధుల్లోకి తీసుకోకుంటే ప్రత్యక్ష పోరుకు సన్నద్దమవుతున్నామని శ్యామలయ్య స్పష్టం చేశారు.

హుజురాబాద్ బై పోల్స్ ఫీల్డ్ అసిస్టెంట్ల సత్తా ఏంటో చేతల్లోనే చూపిస్తామని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలోని 7500 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు హుజురాబాద్‌లోనే మకాం వేసి అధికార పార్టీకి తగిన గుణపాఠం చెప్తామన్నారు. అవసరమైతే ఫీల్డ్ అసిస్టెంట్లు పెద్ద ఎత్తున హుజురాబాద్‌లో నామినేషన్లు వేసి బరిలో నిలిచి తమ సత్తాను చాటి చూపిస్తామని స్పష్టం చేశారు.



Next Story

Most Viewed