ఈడీ దాడుల్లో రికవరీ చేసిన సొమ్ము దేశంలోని పేదలది: ప్రధాని మోడీ

by S Gopi |
ఈడీ దాడుల్లో రికవరీ చేసిన సొమ్ము దేశంలోని పేదలది: ప్రధాని మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నామని ప్రతిపక్షాల నుంచి ఆరోపణలు వచ్చినా సరే, అవినీతిపై తమ ప్రభుత్వ అణచివేత చర్యలు కొనసాగిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. సోమవారం బీహార్‌లోని హాజీపూర్ లోక్‌సభ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగించిన మోడీ.. రాజకీయ నాయకులపై దాడుల్లో రికవరీ చేసిన సొమ్ము దేశంలోని పేదలకు చెందినదని అన్నారు. 'ఈడీ లాంటి సంస్థలకు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నారో మీకు చెప్తాను. గత కాంగ్రెస్ హయాంలో రూ. 35 లక్షలను మాత్రమే ఈడీ స్వాధీనం చేసుకుంది. మేము బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఏజెన్సీ రూ. 2,200 కోట్లను రికవరీ చేశాము. దీని కోసం 70 చిన్న ట్రక్కులను తీసుకెళ్లాల్సి ఉంటుందని ' మోడీ తెలిపారు. ప్రతిపక్షాలు వారి తర్వాతి తరం కోసం ఆందోళన చెందుతున్నాయని, కానీ నాకు అలాంటి వారసులు లేరని, సామాన్య ప్రజలే నా వారసులని మోడీ పేర్కొన్నారు. అధికారంలో ఉన్న దోపిడీలు, కిడ్నాప్‌లను అనుమతించే కాంగ్రెస్, ఆర్జేడీ లాంటి పార్టీలు తమ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తాయని మోడీ ఆరోపణలు చేశారు. అయితే, తాను బతికున్నంత కాలం అలా జరగనివ్వనని తెలిపారు. బీహార్‌లో ఆర్జేడీ పాలనలో కిడ్నాప్‌లు, దోపీడీలు బాగా పెరిగాయి. సామాజిక న్యాయం కోసం ఎన్డీఏ పోరాడుతోంది. 60 శాతం మంది కేంద్ర మంత్రులు ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందినవారేనని వెల్లడించారు.Next Story

Most Viewed