నల్లమలలో కొత్త వైరస్

by  |
నల్లమలలో కొత్త వైరస్
X

దిశ, అచ్చంపేట : నల్లమల ఏజెన్సీ ప్రాంతంలో పశవులకు పది రోజులుగా వింత వ్యాధి సోకుతోంది. అసలే కరోనాతో ప్రజలు సతమతమవుతుంటే ఏజెన్సీలోని రైతులను ఈ వ్యాధి కలవరపెడుతోంది. పశువుల్లో ‘ముద్ద చర్మ వ్యాధి’ అనే వింత వ్యాధి ప్రస్తుతం విస్తృతంగా వ్యాప్తి చెందుతుండటంతో వాటి యజమానులు ఆందోళన చెందుతున్నారు. పశువుల శరీరాలపై బెందులు, బిందువులుగా గతంలో ఎన్నడూ చూడని వ్యాధి వ్యాప్తి చెందుతున్నది. పశువులకు సోకుతున్న ఈ వింత వ్యాధి గురించి పశు వైద్య అధికారులకు చెప్పు కొందామంటే గ్రామాల్లో ఎవరూ అందుబాటులో ఉండటం లేదు.
కానరాని పశువైద్య సిబ్బంది

గ్రామాల్లో పశువులకు సంక్రమిస్తున్న వ్యాధులను, సీజనల్ వచ్చే వ్యాధులను ముందస్తుగా గుర్తించి, స్థానిక పశు వైద్య అధికారులకు, సంబంధిత ఉన్నత అధికారులకు గోపాలమిత్ర పేరుతో అనుసంధాన కర్తగా పశు వైద్య సిబ్బంది పని చేస్తుంటారు. ప్రస్తుతం గోపాలమిత్ర పేరుతో పనిచేస్తున్న సిబ్బంది అందుబాటులో ఉండటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే పశు వైద్య సిబ్బంది సైతం గ్రామాల్లో పర్యటించడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. నియోజకవర్గంలోని ఏజెన్సీ ప్రాంతాలైన అమ్రాబాద్, పదరా అచ్చంపేట, లింగాల, బల్మూరు తదితర మండలాల్లో పశు వైద్య అధికారులు పర్యటించి పశువుల్లో వ్యాపిస్తున్న ఈ వింత వ్యాధిని గుర్తించి, ముందస్తుగా టీకాలు వేస్తే ఈ వ్యాధిని నివారించవచ్చు. ఆ దిశగా సంబంధిత అధికారులు చొరవ చూపాలి. ముద్ద చర్మ వ్యాధి ముఖ్యంగా అమ్రాబాద్ మండలంలో తుర్కపల్లి, వెంకటేశ్వర్ల బావి, కొత్తపల్లి తదితర గ్రామాల్లో వేగంగా వ్యాప్తి చెందుతున్నది. ఈ వ్యాధి మరిన్ని ప్రాంతాలకు విస్తరించకుండా ఉండేందుకు సంబంధిత అధికారులు వేగవంతంగా నివారణ చర్యలు తీసుకోవాలి.

ఆంధ్రప్రదేశ్ నుంచి వ్యాప్తి?

ముద్ద చర్మ వ్యాధి ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు, పశ్చిమ గోదావరి ప్రాంతాల నుంచి వ్యాప్తి చెందిందని నిపుణులు చెబుతున్నారు. 2019 డిసెంబర్‌లో ఈ వ్యాధి విస్తరించిందని సమాచారం. పశువుల క్రయ, విక్రయాల సమయంలో ఇది అంటువ్యాధిగా వ్యాపించిందని సంబంధిత అధికారులు అంటున్నారు. ఈ వ్యాధి సోకిన పశువుల శరీరంపై ఇరవై నుంచి 25 రోజుల పాటు రద్దుర్లు ఏర్పడి ఇబ్బందులు కలుగుజేస్తున్నాయి

పశు వైద్యాధికారులు గ్రామాలకు రావడం లేదు: బుచ్చిరెడ్డి, రైతు, వెంకటేశ్వర్ల బావి

పశువైద్యాధికారులు గ్రామాల్లో పర్యటించడం లేదు. ఇటీవలి కాలంలో ఈ వింత వ్యాధి సోకి పశువులు అనేక అవస్తలు పడుతున్నాయి. ఈ వ్యాధి మరింత విస్తరించకుండా సంబంధించ అధికారులు చర్యలు తీసుకోవాలి.

వ్యాధి సోకుతున్న మాట నిజమే: నాగరాజు, జూనియర్ వెటర్నరీ అధికారి, మన్ననూర్

ఏజెన్సీ ప్రాంతంలో ‘ముద్ద చర్మ వ్యాధి’ అనే కొత్త వ్యాధి పశువులకు సోకుతున్నది నిజమే. ఈ వ్యాధి ఏపీ లోని తూర్పు, పశ్చిమ గోదావరి ప్రాంతాల నుంచి విస్తరించినట్టు గుర్తించాం. పశువుల క్రయవిక్రయాల సమయంలో వాటిని సంతలకు తరలిస్తుంటారని, ఆ టైంలోనే వ్యాధి ఇక్కడి పశువులకు సోకింది. దీని ద్వారా పశువులకు ఎలాంటి ప్రాణహానీ ఉండదు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పెన్సిలన్, ఫ్రీ డీ నోడు లైన్ ఇంజెక్షన్లు 3 నుంచి 5 రోజుల పాటు వేయిస్తే సరిపోతుంది. ఈ మందులు ప్రభుత్వ పశు వైద్య శాలల్లో అందుబాటులో ఉంటాయి.



Next Story

Most Viewed