టెక్నికల్ విద్యలో కొత్త మార్పులు

by  |
టెక్నికల్ విద్యలో కొత్త మార్పులు
X

దిశ, న్యూస్‌బ్యూరో: సాంకేతిక విద్య బోధనలో డిజిటల్ క్లాస్ రూమ్‌లు రావాల్సిన అవసరముందని ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యూకేషన్ (ఏఐసీటీఈ) ఛైర్మన్ డి. సహస్రబుద్ది అన్నారు. ‘ టెక్నికల్ విద్యాబోధనలో పరిస్థితులు, ఎదురవుతున్న సమస్యలు ’ అంశంపై తెలంగాణ ఉన్నత విద్యామండలి (టీఎస్‌సీహెచ్ఈ) గురువారం నిర్వహించిన వెబ్‌నార్‌లో ఆయన మాట్లాడారు. కోవిడ్ -19 అనుకోని సవాళ్లను విసురుతోందని, అందుకు అనుగుణంగా సాంకేతిక విద్యలోనూ మార్పులు రావాల్సి ఉందన్నారు. ఆర్టీఫిషియల్ ఇంటలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ ద్వారా టెక్నాలజీ వినియోగంతో పాటు అధ్యాపకులు శిక్షణ కార్యక్రమాలను కూడా ఏఐసీటీఈ నిర్వహిస్తోందని తెలిపారు. విద్యార్థులను కొత్త సవాళ్లకు సిద్ధం చేయాల్సిఉందని సూచించారు. అనంతరం ఆయన ఏఐసీటీఈలో ఐదు వేల కంపెనీలతో చేస్తున్న ఇంటర్న్ షిప్ వివరాలపై ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆన్‌లైన్‌ విద్యాబోధనలను మరింతగా పెంచాల్సిన అవసరముందని, తప్పని పరిస్థితుల్లో అయితే క్లాస్‌రూముల్లో అవసరమైన మేరకు భౌతిక దూరం అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఈ సమావేశం అభిప్రాయపడింది. ఈ వెబ్‌నార్‌లో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి, సాంకేతిక విద్యామండలి కమిషనర్ నవీన్ మిట్టల్, వినోద్ కుమార్, బీవీ. మోహన్ రెడ్డి, వి.వెంకట రమణ, ఆర్.లింబాద్రి, ఎన్‌వీ రమణారావు పాల్గొన్నారు.



Next Story

Most Viewed