నింగినంటుతోన్న నిత్యావసరాలు

by  |
నింగినంటుతోన్న నిత్యావసరాలు
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : నిత్యావసరాల ధరలు ఆకాశన్నంటుతున్నా నియంత్రించే వారే కరువయ్యారు. సంపూర్ణ లాక్‌డౌన్ సమయంలో అధికారులు కఠినంగా వ్యవహరిస్తామని ప్రకటించడంతో వ్యాపారులు కట్టడిగా వ్యవహరించారు. కానీ, సడలింపులతో పాటు లాక్‌డౌన్ నడుస్తుండటంతో వ్యాపారులు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు. కరోనా కట్టడి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వీయ నియంత్రణలో ఉండాలని, కేవలం నిత్యావసరాల దుకాణాలు మాత్రమే తెరిచి ఉంచాలని ఆదేశించాయి. ఈ సమయంలో ధరలు అడ్డగోలుగా పెంచితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించడంతో వ్యాపారులు నిబంధనలకు అనుగుణంగానే అమ్మకాలు జరిపారు. లాక్‌డౌన్ సడలింపులు ఇవ్వడంతో ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచేస్తున్నారు. హోల్‌సేల్ మార్కెట్‌లోనే పప్పుల ధరలు కిలోకు రూ.20 నుంచి రూ.30 వరకు పెరిగాయి. చింతపండు, ఇతర నిత్యావసరాల ధరల పరిస్థితి కూడా ఇదే రీతిన పెంచి సామాన్యుడి జేబు గుల్ల చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూరగాయల ధరలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని వినియోగదారులు చెప్తున్నారు. మార్కెట్లలో దళారీలు చేస్తున్న దందాతో కొనే పరిస్థితే లేకుండా పోయిందని అంటున్నారు. లాక్‌డౌన్ సమయంలో రూ. 10 ఉన్న కిలో టమాటో ధర ఇప్పుడు ఏకంగా రూ. 40 నుంచి రూ.50కి పెరిగింది. లాక్‌డౌన్ సమయంలో మాత్రమే కఠినంగా ఉండి, సడలింపులు ఇచ్చిన తర్వాత ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. అప్పుడు కంప్లైంట్ సెల్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అధికారులు ఇప్పుడు కూడా అమలు చేస్తే బావుంటుందని అభిప్రాయపడుతున్నారు.

లాక్‌డౌన్‌కు ముందు.. ప్రస్తుతం ఉన్న ధరలు

సరుకులు- లాక్‌డౌన్‌కుముందు- ప్రస్తుతం
కందిపప్పు- 90- 120
పెసర పప్పు -70- 95
ఆయిల్ -90- 110
మినప- 90- 110
చింతపండు- 140- 180

Next Story

Most Viewed