హుజురాబాద్ బై పోల్.. సీఐ కోసం మాజీ నక్సల్స్ డిమాండ్ ఇదే

by  |
హుజురాబాద్ బై పోల్.. సీఐ కోసం మాజీ నక్సల్స్ డిమాండ్ ఇదే
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: ఓ పోలీసు అధికారికి టికెట్ ఇవ్వాలంటూ మాజీ నక్సల్స్ కోరుతున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఆయనకే టికెట్ ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రిని వేడుకుంటున్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గానికి జరగబోతున్న ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ సీఐగా పనిచేస్తున్న పింగిళి ప్రశాంత్ రెడ్డికే ఇవ్వాలంటూ మాజీ నక్సల్స్ కోరుతున్నారు. భూపాలపల్లి జిల్లా కొయ్యూరు ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పీపుల్స్ వార్ మాజీ నక్సల్స్ ప్రశాంత్ రెడ్డి అభ్యర్థిత్వం ఖరారు చేయాలని కోరారు. ఈ సమావేశంలో మంథని ఏఎంసీ డైరెక్టర్ బోయిని రాజయ్యతో పాటు అబ్బినవేన ఐలయ్య, బండారి శంకరయ్య, దుండ్ర చిన్న ఓదేలు, అబ్బినవేన ఓదేలు, బొయిని శంకరమ్మలు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా పోరు బాట పట్టిన ఇప్పలపల్లి గ్రామంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ఇప్పలపల్లి గ్రామం అంటే అన్నల ఊరు అనే పేరుండేదని పోలీసులు తమ గ్రామాన్ని పట్టించుకున్న వారు ఎవరూ లేరన్నారు. 2001లో కొయ్యూరు ఎస్సైగా పనిచేసిన పింగిళి ప్రశాంత్ రెడ్డి ఇప్పలపల్లి గ్రామంపై దృష్టి సారించి ప్రత్యేకంగా ’మాబడి‘ పేరిట పాఠశాల కట్టించారన్నారు. తాము అప్పటికీ సమీపంలోని గంగారం హస్టల్ లో ఉంటూ చదువుకునే వారమని ఉద్యమాల బాట పట్టిన ఇప్పలపల్లిని సంస్కరించే బాధ్యతను ఎస్సైగా ప్రశాంత్ రెడ్డి తన భుజాలపై వేసుకున్నారన్నారు. ప్రజాప్రతినిధులు చేయాల్సిన పనులను ఆయన ఆధ్వర్యంలో నిర్వహించి రోడ్లు కూడా వేయించారన్నారు.

పోలీసు అధికారిగా ఉన్న ప్రశాంత్ రెడ్డి కఠినంగా వ్యవహరించకుండా ఈ ప్రాంత యువత నక్సల్స్ వైపు ఎందుకు వెలుతున్నారన్న విషయాన్ని గుర్తించి మరీ అభివృద్ది కార్యక్రమాలు నిర్వహించారని పేర్కొన్నారు. పోలీసు అధికారిగానే సమాజాన్ని సంస్కరించే బాధ్యత నిర్వర్తించిన ఆయనకు హుజురాబాద్ ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఆ ప్రాంతాన్ని అన్నింటా బాగు పరుస్తారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. జమ్మికుంటలో పనిచేసినప్పుడు కూడ జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించి ప్రతి ఒక్కరిలో జాతీయ భావాన్ని పెంచేందుకు కృషి చేశారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హుజురాబాద్ టికెట్ ను ప్రశాంత్ రెడ్డికి ఇచ్చినట్టయితే ఇలాంటి సంస్కరణలు రానున్న కాలంలో ఆ ప్రాంతంలో తీసుకొస్తారని పీపుల్స్ వార్ మాజీలు అంటున్నారు. ఓ పోలీసు అధికారికి టికెట్ ఇవ్వాలంటూ మాజీ నక్సల్స్ సీఎంను కోరడమే చర్చనీయాంశంగా మారింది.



Next Story

Most Viewed