రామ్‌దేవ్‌బాబాకు సుప్రీంకోర్టు సమన్లు

by Dishanational1 |
రామ్‌దేవ్‌బాబాకు సుప్రీంకోర్టు సమన్లు
X

దిశ, నేషనల్ బ్యూరో: తప్పుదారి పట్టించే ప్రకటనలు జారీ చేసినందుకు ఇచ్చిన ధిక్కార నోటీసుపై స్పందించడంలో విఫలమైనందుకు పతంజలి ఆయుర్వేదంపై సుప్రీంకోర్టు మంగళవారం తీవ్రంగా హెచ్చరించింది. యోగా గురు రామ్‌దేవ్‌కు భారత అత్యున్నత న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. పతంజలి ఆయుర్వేద సంస్థ వ్యవస్థాపకుడిగా ఆయనతో పాటు మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ కోర్టు ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. పతంజలి ఉత్పత్తులకు సంబంధించిన హామీలను ప్రాథమికంగా ఉల్లంఘించినందుకు, ఆధునిక వైద్య విధానాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని సంస్థపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై విచారణకు అంగీకరించిన న్యాయమూర్తులు హిమా కోహ్లీ, అహ్సానుద్దీన్ అమానుల్లాతో కూడిన ధర్మాసనం పతంజలి సంస్థను మందలించింది. గతేడాది నవంబర్‌లో విచారణ సందర్భంగా..తమ ఉత్పత్తులు రకరకాల వ్యాధులను నయం చేస్తుందనేలా అసత్య, తప్పుదోవ పట్టించే యాడ్స్ ఇవ్వకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. లేకుంటే కోర్టు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తుందని హెచ్చరించింది. ఇకమీదట ఎటువంటి ఉల్లంఘనలు జరగవని సంస్థ తరపు న్యాయవాది కూడా ఇదివరకు కోర్టు ముందు చెప్పారు. ఈ క్రమంలోనే గతంలో ఇచ్చిన హామీని ఉల్లంఘించడంపై కోర్టు గతనెలలోనూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వారిపై ఎందుకు చర్యలు తీసుకోకూడదని రామ్‌దేవ్ బాబా, ఆచార్య బాలకృష్ణకు నోటీసులిచ్చింది. అయితే, ఆ నోటీసులకు సైతం వారు బదులివ్వడంలో విఫలమయ్యారు. ప్రతిస్పందన ఎందుకు దాఖలు చేయలేదని ధర్మాసనం ప్రశ్నించింది. తదుపరి విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది.


Next Story