జై భవానీ అనే పదాన్ని తొలగించేది లేదు.. ఈసీ నోటీసులపై స్పందించిన ఉద్ధవ్

by Dishanational6 |
జై భవానీ అనే పదాన్ని తొలగించేది లేదు.. ఈసీ నోటీసులపై స్పందించిన ఉద్ధవ్
X

దిశ, నేషనల్ బ్యూరో: తన పార్టీ గీతం నుంచి జై భవానీని తొలగించాలని కోరడం.. మహారాష్ట్రను అవమానించడమే అన్నారు శివసేన యూబీటీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే. తన పార్టీ ఆంథెమ్ నుంచి జై భవానీ, హిందూ అనే పదాలను తొలగించాలని ఈసీ నోటీసులు జారీ చేసిందని తెలిపారు. కానీ, తాను ఆ పదాలను తొలగించనని.. వాటికి కట్టుబడి ఉన్నానని మీడియా సమావేశంలో పేర్కొన్నారు. తమ పార్టీ కొత్త గుర్తు "మషల్" (మంటలు మండుతున్న టార్చ్)ని ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు ఒక గీతాన్ని రూపొందించామన్నారు. అయితే, దాని నుంచి "హిందూ", "జై భవానీ" పదాలను తొలగించాలని ఎన్నికల సంఘం కోరిందని ఠాక్రే చెప్పారు.

ఛత్రపతి శివాజీ మహారాజ్ తుల్జా భవానీ దేవి ఆశీస్సులతో హైందవీ స్వరాజ్‌ను స్థాపించారని స్పష్టం చేశారు. దేవుడి పేరుతోనో.. హిందూ మతం పేరుతోనో ఓట్లు అడగటం లేదని.. పరోక్షంగా బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఈసీ నోటీసులు పంపడం అవమానకరం అని దాన్ని సహించబోయేది లేదని స్పష్టం చేశారు. బహిరంగ సభల్లో పాల్గొనేటప్పుడు జై భవానీ, జై శివాజీ అని చెప్పే ప్రసంగం స్టార్ట్ చేస్తామని చెప్పారు.

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి మోడీ వచ్చినప్పుడు.. జై భజరంగ్ బలి అని చెప్పి ఈవీఎం బటన్ నొక్కాలని ప్రజలను కోరారని గుర్తు చేశారు. ప్రధాని అలా చెప్పినప్పుడు ఈసీ ఏం చేసిందని ప్రశ్నించారు. అయోధ్య రామ్ లల్లా దర్శనం ఉచితంగా పాంలంటే బీజేపీకి ఓటు వేయాలని ప్రజలకు అమిత్ షా చెప్పినప్పుడు ఈసీ ఏం చేసిందన్నారు. మతం పేరుతో ఓట్లు అడగొచ్చా?.. చట్టాలను మార్చారా అని ఈసీని శివసేన యూబీటీ ప్రశ్నించింది.

తమ రాసిన లెటర్ కు, పంపిన రిమైండర్ కు ఎన్నికల సంఘం స్పందించలేదన్నారు ఉద్ధవ్. చట్టాలను మార్చినట్లయితే తమ ఎన్నికల ర్యాలీల్లోనూ 'హర్ హర్ మహాదేవ్' అని చెబుతామని అన్నారు. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు హిందుత్వ ప్రచారం చేసినందుకే తన తండ్రి బాలాసాహెబ్ ఠాక్రేను ఆరేళ్లపాటు ఎన్నికల్లో ఓటు వేయకుండా, పోటీ చేయకుండా నిషేధించారని గుర్తుచేశారు ఉద్ధవ్.



Next Story

Most Viewed