ప్రత్యేక రాష్ట్రంగా ప‌శ్చిమ యూపీ: మాయావ‌తి సంచలన వ్యాఖ్యలు

by Dishanational1 |
ప్రత్యేక రాష్ట్రంగా ప‌శ్చిమ యూపీ: మాయావ‌తి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: బీఎస్పీ అధినేత్రి, యూపీ మాజీ ముఖ్యమంత్రి మాయావతి లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న వేళ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పశ్చిమ ఉత్తరప్రదేశ్‌ను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటిస్తామని చెప్పారు. ఆదివారం ముజఫర్‌నగర్‌లో సార్వత్రిక ఎన్నికల కోసం జరిగిన ప్రచార ర్యాలీలో మాట్లాడిన ఆమె.. ఈ ప్రాంత ప్రజలు కోరుకుంటే, అభివృద్ధి అందించడం కోసం, వారి ఆకాంక్షలను నెరవేర్చేందుకు పశ్చిమ యూపీని ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించడానికి సమర్థవంతమైన చర్యలు తీసుకుంటాం. బీఎస్పీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తక్షణం పేదలు, కార్మికులు, రైతులు, చిన్న వ్యాపారులకు కావాల్సిన అవసరాలను గుర్తించి సేవలు అందించడమే కాకుండా ఈ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక చొరవను తీసుకుంటామని ఆమె పేర్కొన్నారు. ఇదే సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఆమె విమర్శలు చేశారు. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగి ఓటింగ్ యంత్రాలను తారుమారు చేయకుంటే ఈసారి బీజేపీ అధికారంలోకి రాదని బీఎస్పీ చీఫ్ అన్నారు. బీజేపీ సంపన్న వ్యాపారవేత్తలను మరింత సంపన్నులుగా చేయడం, వారిని రక్షించడం కోసం ఎక్కువ సమయం వెచ్చిస్తోంది. బీజేపీ, ఇతర పార్టీలు వ్యాపారాల మద్దతుతో ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. ఎన్నికల బాండ్ల డేటాను చూస్తే ఈ విషయం తేటతెల్లమవుతుందని మాయావతి వెల్లడించారు.

Next Story

Most Viewed