భర్త ఫ్యామిలీపై భార్య ఫిర్యాదు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

by Dishanational4 |
భర్త ఫ్యామిలీపై భార్య ఫిర్యాదు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో : భర్త, అతడి కుటుంబ సభ్యులపై భార్య స్థానంలో ఉన్నవారు మోపే నేరాభియోగాలను కోర్టులు తప్పనిసరిగా క్షుణ్నంగా పరిశీలించాలని ఢిల్లీ హైకోర్టు నిర్దేశించింది. భర్తపై చేసిన నేరారోపణలు నిజమైనవా ? లాయర్ ద్వారా అందంగా రాయించినవా ? అనేది తేల్చాల్సిన బాధ్యత న్యాయస్థానాలపైనే ఉంటుందని తెలిపింది. ఒకవేళ నిజాన్ని నిగ్గు తేల్చకుంటే.. మంచివాళ్లను ఇబ్బందుల్లోకి నెట్టినట్లు అవుతుందని హైకోర్టు కామెంట్ చేసింది. ఓ మహిళకు 1997లో పెళ్లయింది. అయితే చాలా ఏళ్లుగా ఆమె తన భర్త నుంచి దూరంగా పుట్టినింటిలోనే ఉంటోంది. కట్ చేస్తే.. పెళ్లి జరిగిన 23 ఏళ్ల తర్వాత 2017లో సదరు మహిళ తన భర్త, అతడి మేనమామ, మేనత్తలపై కేసు పెట్టింది. వాళ్లు తనను కొట్టడంతో పాటు వేధించారని ఆరోపించింది. దీంతో పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. ఈ పిటిషన్‌లో తమను నిందితులుగా చేర్చడాన్ని తప్పుపడుతూ సదరు వ్యక్తి మేనమామ, మేనత్తలు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తాము ఎన్నడూ మేనల్లుడితో కలిసి ఒక ఇంట్లో నివసించలేదని.. వేరుగానే జీవిస్తున్నామని న్యాయస్థానానికి తెలిపారు. అయినప్పటికీ మేనల్లుడి భార్యను వేధించినట్లుగా తమపై తప్పుడు కేసును నమోదు చేశారని ఆరోపించారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన జస్టిస్ నవీన్ చావ్లాతో కూడిన ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం.. వారిపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను రద్దు చేయాలని ఆదేశించింది.


Next Story