ఉత్తరాఖండ్‌ అడవుల్లో చాలా చోట్ల అదుపులోకి వచ్చిన మంటలు

by Disha Web Desk 17 |
ఉత్తరాఖండ్‌ అడవుల్లో చాలా చోట్ల అదుపులోకి వచ్చిన మంటలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరాఖండ్‌ అడవుల్లో శుక్రవారం కార్చిచ్చు చెలరేగిన సంగతి తెలిసిందే. నైనిటాల్‌ జిల్లాలో మంటలు మరింత తీవ్రం కావడంతో వాటిని ఆర్పివేయడానికి ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ తీవ్రంగా కృషి చేస్తున్నాయి. భారత వైమానిక దళ సిబ్బంది హెలికాప్టర్‌ను ఉపయోగించి బ్యాంబి బకెట్ ఆపరేషన్‌ ద్వారా నీళ్లను మంటలపై వెదజల్లుతున్నారు. అయితే ఈ ప్రయత్నాలు కొంత మేరకు ఫలించాయి. జిల్లాల్లోని చాలా చోట్ల మంటలు అదుపులోకి వచ్చాయని అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నరేంద్రనగర్ అటవీ డివిజన్‌లోని మాణిక్‌నాథ్ పరిధిలోని మారోరా, ఖానానా సివిల్ ఏరియాల్లో మంటలు పూర్తిగా ఆరిపోయాయని వారు తెలిపారు.

నైనిటాల్, హల్ద్వానీ, రామ్‌నగర్ అటవీ డివిజన్లలోని అత్యంత ప్రభావిత ప్రాంతాలలో మంటలు ఇంకా అదుపులోకి రాకపోవడంతో వాటిని ఆర్పే ప్రయత్నాలు ఇంకా ముమ్మరం చేసినట్లు అటవీ అధికారులు ఆదివారం పేర్కొన్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో మంటలు ఎగిసి పడుతుండడంతో మంటలను క్రమంగా అదుపు చేస్తున్నారు. IAF హెలికాప్టర్‌ను మోహరించిన తర్వాత నైనిటాల్, పరిసర ప్రాంతాల్లోని మంటలు క్రమంగా అదుపులోకి వస్తున్నాయని మిగతా వాటిని కూడా పూర్తిగా అదుపులోకి తీసుకొస్తామని పరిస్థితిని సమీక్షించిన తర్వాత సీనియర్ అధికారులు తెలిపారు.

మంటలను ఆర్పి వేయడానికి స్థానికులు కూడా సహాయం చేస్తున్నారు. అటవీ శాఖ సిబ్బంది కొండల్లోని గ్రామాలకు గ్రామాలు తిరుగుతూ అడవుల్లో మంటలపై అవగాహన కల్పిస్తున్నారు. లౌడ్ స్పీకర్లను ఉపయోగిస్తుూ, అడవిలో ఎక్కడైనా మంటలు చెలరేగితే వెంటనే అధికారులకు తెలియజేయాలని, బహిరంగ ప్రదేశాల్లో చెత్తను కాల్చవద్దని, కాల్చే సిగరెట్ పీకలు లేదా బీడీలను అటవీ ప్రాంతాల్లో అజాగ్రత్తగా వేయవద్దని ప్రజలను కోరుతున్నారు. ఎవరైనా అడవికి నిప్పు పెడితే వారిపై అటవీ చట్టం 1927 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.



Next Story