శ్రీలంక, మారిషస్‌లో యూపీఐ సేవలు ప్రారంభం

by Dishanational1 |
శ్రీలంక, మారిషస్‌లో యూపీఐ సేవలు ప్రారంభం
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశీయ డిజిటల్ లావాదేవీల యూపీఐ సేవలు అంతర్జాతీయంగా మరిన్ని దేశాలకు విస్తరిస్తోంది. సోమవారం శ్రీలంక, మారిషస్ దేశాల్లోనూ ఈ సేవలు మొదలయ్యాయి. భారత ప్రధాని నరేంద్ర మోడీతో పాటు శ్రీలంక, మారిషస్ దేశాల ప్రధానులు వర్చువల్‌గా డిజిటల్ చెల్లింపులను ప్రారంభించారు. మారిషస్‌లో రూపే కార్డు సేవలు కూడా మొదలయ్యాయి. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని మోడీ, హిందూ మహాసముద్ర ప్రాంతంలోని మూడు దేశాలకు నేడు ప్రత్యేకమైన రోజు అని వెల్లడించారు. శ్రీలంక, మారిషస్‌ దేశాలతో భారత ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అవుతున్న ఈ సందర్భంలో భారత్‌కు చెందిన సేవలు ప్రారంభం కావడం సంతోషమన్నారు. ప్రజలకిచ్చిన అభివృద్ధికి ఇది నిర్దర్శనమని, దేశాల మధ్య చారిత్రక సంబంధాలను డిజిటల్ మార్గంలో అనుసంధానం అవుతోందన్నారు. ఈ రకమైన డిజిటల్ సంబంధం బోర్డర్ లావాదేవీల్లో సాయపడటమే కాకుండా సరిహద్దుల మధ్య సంబంధాలను మరింత పటిష్టం చేస్తుందన్నారు. మారిషస్‌లో యూపీఐ సేవలు ప్రారంభం కావడం పట్ల ఆ దేశ ప్రధాని ప్రవింద్ జుగ్నాథ్ హర్షం వ్యక్తం చేశారు. భారత రూపే కార్డును జాతీయ చెల్లింపుల స్విచ్‌త్ కోబ్రాండ్ చేసినట్టు ఆయన తెలిపారు. యూపీఐ సేవల ద్వారా రెండు దేశాల మధ్య సాంస్కృతిక, ఆర్థిక సంబంధాలు ప్రతిబింబిస్తాయని శ్రీలంక అధ్యక్షుడు విక్రమసింఘే పేర్కొన్నారు.



Next Story

Most Viewed