యూఎన్ఎస్సీలో సంస్కరణలు అవసరమే: భారత్ ప్రతిపాదనకు బెలారస్ మద్దతు

by Dishanational2 |
యూఎన్ఎస్సీలో సంస్కరణలు అవసరమే: భారత్ ప్రతిపాదనకు బెలారస్ మద్దతు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యూఎన్ఎస్సీ)లో నూతన సంస్కరణలు తీసుకురావాలని భారత్ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన యూఎన్ఎస్సీ 78వ సెషన్‌లోనూ ఈ విషయంపై పదే పదే తన వాదనలు వినిపించింది. అయితే భారత్ ప్రతిపాదనకు తాజాగా బెలారస్ మద్దతు తెలిపింది. యూఎన్ఎస్సీలో సంస్కరణలు అవసరమేనని అభిప్రాయపడింది. రెండు రోజుల పర్యటన నిమిత్తం బెలారస్ విదేశాంగ మంత్రి సెర్గీ అలీనిక్ భారత్‌కు వచ్చారు. ఈ సందర్భంగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌తో భేటీ అయ్యారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. అంతేగాక ప్రపంచ సమస్యలపైనా డిస్కస్ చేశారు. రెండు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని పెంచేందుకు మరింత కృషి చేయాలని నిర్ణయించారు.

అనంతరం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘యూఎన్ఎస్సీలో మార్పులపై బెలారస్ సైతం చర్చించింది. ప్రస్తుత పరిస్థితుల దృష్యా సంస్కరణలు తీసుకురావాల్సిందే. వీటిని సులభతం చేయాలి. ప్రపంచంలోని సవాళ్లను దృష్టిలో ఉంచుకుని యూఎన్ఎస్సీని ఆధునీకరించాలి. 78వ జనరల్ అసెంబ్లీ సెషన్‌లో బెలారస్ అధికారిక ప్రకటనలో ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పాం. భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఇచ్చే విషయంలోనూ మద్దతుగా ఉంటాం’ అని వ్యాఖ్యానించారు. భారత్-బెలారస్‌లు మరింత న్యాయమైన, బహుళ ప్రపంచాన్ని సృష్టించే దిశగా అభిప్రాయాలను పంచుకుంటాయని అలీనిక్ నొక్కి చెప్పారు. అంతర్జాతీయ సంబంధాల సూత్రాలపైనా అదే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. శాంగై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీవో)లో బెలారస్ చేరికపై మెమోరాండంను ఆమోదించిన మొదటి దేశం భారతదేశమేనని గుర్తు చేశారు. అందుకు బెలారస్ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే ఎస్సీవోలో చేరతామని ఆశాభావం వ్యక్తం చేశారు.

కాగా, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తక్షణ సంస్కరణలు అవసరమని భారత్ వాదిస్తోంది. ఇటీవల జరిగిన యూఎన్ఎస్సీ సమావేశంలో ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ ఈ అంశాన్ని లేవనెత్తారు. సంస్కరణల కోసం ఇంకెంత కాలం వేచి ఉండాలని ప్రశ్నించారు. అంతేగాక వీటో అధికారాన్ని ఉపయోగించి సంస్కరణల ప్రక్రియను అడ్డుకోవద్దని కూడా సూచించారు. అంతకుముందే భారత్ ప్రతిపాదనకు జీ4లోని బ్రెజిల్, జర్మనీ, జపాన్ దేశాలు మద్దతు తెలపగా..తాజాగా బెలారస్ సైతం మద్దతు ఇస్తున్నట్టు వెల్లడించింది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed