24 గంటల్లో అరుణ్ గోయల్ నియామకంపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం!

by Disha Web Desk |
24 గంటల్లో అరుణ్ గోయల్ నియామకంపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్నికల కమిషనర్ల నియామకంపై సుప్రీంకోర్టులో గురువారం విచారణ జరిగింది. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామకాలకు కొలీజియం వంటి వ్యవస్థ ఏర్పాటు చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. భారత ఎన్నికల సంఘం సభ్యుల నియామక ప్రక్రియలో సంస్కరణలను కోరుతూ దాఖలైన పిటిషన్లపై వరసగా మూడవ రోజు విచారణ జరిగింది. ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ పిటీషన్లపై విచారణ జరిపింది. ఇటీవల ఈసీ అరుణ్‌ గోయల్‌ నియామకానికి సంబంధించిన ఫైళ్లను సుప్రీంకోర్టుకు అటార్నీ జనరల్‌ సమర్పించారు. నియామకంలో కేంద్రం చూపిన వేగాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. 24 గంటల్లోనే అరుణ్ గోయల్ నీయామక ప్రక్రియ పూర్తవడంపై ధర్మాసనం పలు ప్రశ్నలు సంధించింది.

కేంద్ర ఎన్నికల కమిషనర్ పదవి మే15వ తేదీన ఖాళీ అయితే ఆ ఖాళీని భర్తీ చేయడానికి నవంబర్ 18 వరకు ఎటువంటి చర్యలు తీసుకున్నారు. ఈ గ్యాప్ లో ఏం జరిగిందో చెప్పాలంటూ అటార్నీ జనరల్ ను సుప్రీంకోర్టు ధర్మాసనం నిలదీసింది. 24 గంటలు గడవకుండానే ఒకేరోజు నియామక ప్రక్రియ ప్రారంభం కావడం, అదే రోజు క్లియరెన్స్, దరఖాస్తు, నియామకం ఎలా జరుగుతుందని ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు ప్రశ్నలకు ఏజీ స్పందిస్తూ.. ఎన్నికల కమిషనర్ ఎంపిక ప్రక్రియలో ఎక్కడా తప్పు జరగలేదని గతంలో కూడా ఇంతే వేగంగా నియామకాలు జరిగిన సందర్భాలు ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. న్యాయశాఖ ప్రతిపాదించిన నాలుగు పేర్లను డీఓపీటీ డేటాబేస్ నుంచే తీసుకున్నారని ఆ వివరాలన్ని బహిరంగంగానే అందుబాటులో ఉన్నాయని వివరించారు. ఈ కేసులో లిఖిత పూర్వక వాదనలు దాఖలు చేసేందుకు వాద, ప్రతివాదులకు ఐదు రోజుల సమయం ఇస్తూ తీర్పును రిజర్వ్ చేసింది.


Next Story

Most Viewed