‘ది కేరళ స్టోరీ’ చిత్ర నిషేధానికి హైకోర్టు నో

by Disha Web Desk 12 |
‘ది కేరళ స్టోరీ’ చిత్ర నిషేధానికి హైకోర్టు నో
X

చెన్నై: వివాదాస్పద ‘ది కేరళ స్టోరీ’ చిత్రాన్ని నిషేధిస్తూ దాఖలైన పిటిషన్ ను మద్రాసు హైకోర్టు గురువారం కొట్టివేసింది. దేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఉన్న ఈ చిత్రం విడుదల నిలిపివేయాలని కోరుతూ జమాతే ఉలేమా ఎ హింద్ సహా పలువురు దాఖలు చేసిన పిటిషన్లను స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిన మరుసటి రోజే మద్రాసు హైకోర్టు కూడా పిటిషన్ ను కొట్టేయడం విశేషం. ఈ చిత్రం సమాజంలో విద్వేషాన్ని రెచ్చగొట్టేదిగా ఉందని భావిస్తే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సూచించింది. శుక్రవారం విడుదల కానున్న ఈ చిత్రం కేరళలో హిందూ యువతీ యువకులకు సంబంధించినది.

యువతులను ఇస్లాం మతంలోకి మార్చి వారిని ఇస్లామిక్ స్టేట్ అనే అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థల్లో చేర్చినట్లు, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినట్లు ఈ సినిమాను చిత్రీకరించారు. అదా శర్మ కథానాయికగా, సుదీప్తో సేన్ రచించి, దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని విపుల్ అమృత్ లాల్ షా నిర్మించారు. కేరళ రాష్ట్రం పట్ల తప్పుడు ప్రచారం చేసేలా, మత విద్వేషాన్ని రెచ్చగొట్టేలా నిర్మించిన ఈ చిత్రం వెనుక కొన్ని శక్తుల కుటిల రాజకీయం ఉందని వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ ఆరోపించాయి. చిత్ర నిర్మాత, దర్శకుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కేరళ డీజీపీకి సీపీఎం యువజన విభాగం డీవైఎఫ్ఐ ఫిర్యాదు చేసింది.


ఇవి కూడా చదవండి:

అదే నా అతిపెద్ద వీక్‌నెస్‌.. ఇప్పటికీ అలవాటు పోవట్లేదు?

Next Story

Most Viewed