హిమాచల్‌ప్రదేశ్‌లో టెన్షన్: బల పరీక్ష చేపట్టాలని గవర్నర్‌కు బీజేపీ విజ్ఞప్తి

by Dishanational2 |
హిమాచల్‌ప్రదేశ్‌లో టెన్షన్: బల పరీక్ష చేపట్టాలని గవర్నర్‌కు బీజేపీ విజ్ఞప్తి
X

దిశ, నేషనల్ బ్యూరో: హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీలో తగినంత మెజారిటీ లేనప్పటికీ రాజ్యసభ సీటును బీజేపీ గెలుచుకున్న విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. ఈ నేపథ్యంలోనే సుఖ్వింధర్‌సింగ్ సుఖు నేతృత్వంలోని ప్రభుత్వానికి బలపరీక్ష చేపట్టాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు బుధవారం బీజేపీ సీనియర్ నేత, రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత జైరాం ఠాకూర్ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి రాజ్‌భవన్‌లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో భేటీ అయ్యారు. అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని కోరారు. ప్లోర్ టెస్ట్ సహా కట్‌ మోషన్‌, ఆర్థిక బిల్లుపై ఓటింగ్ చేపట్టాలని తెలిపారు. అనంతరం జైరాం ఠాకూర్ మీడియాతో మాట్లాడుతూ.. గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి హర్ష్ మహాజన్ విజయం సాధించారని గుర్తు చేశారు. దీంతో అధికారంలో కొనసాగే నైతిక హక్కును కాంగ్రెస్ ప్రభుత్వం కోల్పోయిందన్నారు.

సంక్షోభంలో సుఖు ప్రభుత్వం

మొత్తం 68 అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్‌కు 40 మంది, బీజేపీకి 25 మంది ఎమ్మెల్యేలు, స్వతంత్ర్య అభ్యర్థులు ముగ్గురు ఉన్నారు. అయితే మంగళవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సహా ముగ్గురు ఇండిపెండెంట్లు బీజేపీ వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. దీని ప్రకారం..బీజేపీ సంఖ్యా బలం 34కు చేరుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు 35సీట్లు అవసరం కావాల్సి ఉంది. దీంతో మరో ఎమ్మెల్యే బీజేపీ వైపు మొగ్గు చూపితే ప్రభుత్వం పడిపోవడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు ఈ పరిణామాల దృష్యా కాంగ్రెస్ హైకమాండ్ యాక్టివ్‌ అయింది. ఈ సంక్షోభాన్ని పరిష్కరించే బాధ్యతను హర్యానా మాజీ సీఎం భూపేంద్ర హుడా, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌లకు అప్పగించింది. వీరిద్దరూ కాసేపట్లో రాష్ట్ర రాజధాని సిమ్లా చేరుకోనున్నట్టు తెలుస్తోంది.

సీఎంను మార్చాలని రెబల్ ఎమ్మెల్యేల డిమాండ్ !

క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎంను మార్చాలని డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. ముఖ్యమంత్రి సుఖ్వింధర్ తీరుపై వారు అసంతృప్తితో ఉన్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలోనే బీజేపీకి మద్దతు ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో కేవలం 14 నెలల పాటు కొనసాగిన సుఖు ప్రభుత్వానికి టెన్షన్ నెలకొంది. అయితే అసంతృప్త ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు రంగంలోకి దిగిన కాంగ్రెస్ అధిష్టానం ఈ సమస్యను ఏ విధంగా పరిష్కరిస్తుందో వేచి చూడాల్సిందే. మరోవైపు రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసిన తర్వాత ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సిమ్లా నుంచి హర్యానాకు వెళ్లారని, వారు బీజేపీతో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.



Next Story

Most Viewed