శంభూ సరిహద్దుకు 14వేల మంది రైతులు.. 1200 ట్రాక్టర్లతో..

by Dishanational5 |
శంభూ సరిహద్దుకు 14వేల మంది రైతులు.. 1200 ట్రాక్టర్లతో..
X

దిశ, నేషనల్ బ్యూరో: రెండు రోజుల విరామం అనంతరం బుధవారం తిరిగి ప్రారంభమైన రైతుల ‘ఢిల్లీ చలో’ ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) కల్పించాలన్న డిమాండ్‌తో ఢిల్లీలోకి ప్రవేశించాలనుకుంటున్న అన్నదాతలను పోలీసులు మరోసారి అడ్డుకున్నారు. యూపీ, హర్యానా, పంజాబ్‌ నుంచి 14వేల మందికి పైగా రైతులు పంజాబ్‌- హర్యానా సరిహద్దు ప్రాంతం శంభు వద్దకు చేరుకున్నారు. 1200కు పైగా ట్రాక్టర్లతో వచ్చిన వీరంతా.. ఢిల్లీలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైతులను అడ్డుకునేందుకు వారిపైకి పోలీసులు రబ్బరు బుల్లెట్లను పేల్చారు. సౌండ్ కెనాన్లు, టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. టియర్ గ్యాస్ నుంచి రక్షించుకోవడానికి ప్రత్యేక మాస్క్‌లు, భారీ శబ్దాలతో వినికిడి శక్తి కోల్పోకుండా ఉండేందుకు రైతులు ఇయర్ బడ్స్ ధరించివచ్చారు. అయితే, రబ్బరు బుల్లెట్లు తగిలి ఓ రైతు ప్రాణాలు కోల్పోగా, 160 మందికిపైగా అన్నదాతలు గాయపడ్డారని రైతు సంఘం నేతలు వెల్లడించారు.

మార్చ్‌కు రెండు రోజులు బ్రేక్

హర్యానాలోని ఖనౌరి సరిహద్దులో నిరసన తెలుపుతున్న రైతులకు, పోలీసులకు మధ్య బుధవారం సాయంత్రం ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ ఘర్షణల్లో భటిండాకు చెందిన శుభ్ కరణ్ సింగ్(23) అనే యువ రైతు ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల చర్యలతోనే అతను మరణించారని ‘ఆల్ ఇండియా కిసాన్ సభ’ (ఏఐకేఎస్) రైతు సంఘం ఆరోపించగా, పోలీసులు దానిని ఖండించారు. మరోవైపు, శుభ్ కరణ్ సింగ్‌ తలకు బుల్లెట్ గాయం తగిలిందని పాటియాలా ఆస్పత్రి వైద్యుడు తెలిపారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం పూర్తి వివరాలు తెలుస్తాయి. రైతు మరణంతో ఢిల్లీ మార్చ్‌ను రెండు రోజులపాటు నిలిపివేస్తున్నట్టు ఏఐకేఎస్ ప్రకటించింది. అయితే, బైఠాయింపు నిరసన ప్రదర్శన మాత్రం కొనసాగుతుందని వెల్లడించింది. ఈ సందర్భంగా ఓ ప్రకటన విడుదల చేసింది. రైతు అనుకూల ప్రభుత్వం అని చెప్పుకునే మోడీ పాలనలోని అసలైన క్రూరత్వాన్ని ఈ హత్య బట్టబయలు చేసిందని ఆరోపించారు. నిరసన తెలుపుతున్న తమను కేంద్రం శత్రు దేశం సైనికుల్లా చూస్తోందని, తమపై యుద్ధానికి దిగిందని ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు, పంజాబ్ ప్రభుత్వానికి కేంద్రం లేఖ రాసింది. రైతుల ముసుగులో కొందరు దుండగులు సంఘ విద్రోహ చర్యలకు పాల్పడే అవకాశం ఉందని, కాబట్టి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది.

చర్చించేందుకు సిద్ధం: కేంద్రం

ఆందోళన చేస్తున్న రైతులను కేంద్రం మరోసారి చర్చలకు ఆహ్వానించింది. బుధవారం నాటి ఆందోళనలు ప్రారంభమవడానికి ముందే ఉదయం కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి అర్జున్ ముండా ‘ఎక్స్’లో స్పందించారు. రైతుల డిమాండ్లపై మరోసారి చర్చించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని, చర్చలకు రైతు సంఘం నాయకులను మరోసారి ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. కాగా, ఇప్పటికే రెండు వర్గాల మధ్య నాలుగుసార్లు చర్చలు జరిగినప్పటికీ సమస్యకు పరిష్కారం దొరకలేదు. చివరిసారిగా ఈ నెల 18(ఆదివారం) రాత్రి జరిగిన చర్చల్లో మూడు రకాల(మొక్కజొన్న, పప్పు ధాన్యాలు పత్తి) పంటలకు ఐదేళ్లపాటు ఎంఎస్పీ కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్రం ప్రతిపాదనలు చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రతిపాదనలను రైతు సంఘాలు తిరస్కరించాయి. అన్ని పంటలకు ఎంఎస్పీ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నాయి. చర్చల సందర్భంగా సోమ, మంగళవారాల్లో ఆందోళనలను ఆపివేసిన అన్నదాతలు.. బుధవారం నుంచి మళ్లీ ప్రారంభించారు.



Next Story