Tata Technologies: 18 ఏళ్ల తర్వాత ఐపీఓకు వస్తున్న టాటా అనుబంధ కంపెనీ!

by Disha Web Desk 10 |
Tata Technologies: 18 ఏళ్ల తర్వాత ఐపీఓకు వస్తున్న టాటా అనుబంధ కంపెనీ!
X

ముంబై: దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్‌కు చెందిన అనుబంధ టాటా టెక్నాలజీస్ ఐపీఓకు రానుంది. దీనికి సంబంధించి మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి పబ్లిక్ ఇష్యూ(ఐపీఓ) పత్రాలను సమర్పించినట్టు శుక్రవారం ప్రకటనలో తెలిపింది. ఈ ఐపీఓ సైజ్ రూ. 3,800 కోట్లుగా ఉండొచ్చని తెలుస్తోంది. టాటాకు చెందిన ఓ కంపెనీ 18 ఏళ్ల తర్వాత ఐపీఓకు రానుండటం విశేషం. చివరిసారిగా 2004లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) టాటా నుంచి పబ్లిక్ ఇష్యూకు వచ్చింది. టాటా మోటార్స్‌తో పాటు ఇద్దరు పెట్టుబడిదారులకు చెందిన 9.57 కోట్ల షేర్లను విక్రయానికి రానున్నాయి. ఇది 23.6 శాతానికి సమానం. ప్రస్తుతం టాటా టెక్నాలజీస్‌లో టాటా మోటార్స్‌కు 74.42 శాతం ఉంది. టాటా కేపిటల్ అడవైజర్స్‌కు చెందిన సింగపూర్ పెట్టుబడి సంస్థ ఆల్ఫా 8.96 శాతం, టాటా కేపిటల్ గ్రోత్ ఫండ్ 4.48 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఈ ఐపీఓ ఆఫర్ ఫర్ సేల్ కింద జరగనుంది. టాటా టెక్నాలజీ ప్రపంచవ్యాప్తంగా 11,000 మందికి పైగా ఉద్యోగులను కలిగి ఉంది. టాటా టెక్నాలజీ కంపెనీ ఆటోమోటివ్, ఏరోస్పేస్, ఇండస్ట్రియల్ హెవీ మిషనరీ విభాగాల్లో ప్రోడక్ట్ ఇంజనీరింగ్, డిజిటల్ సేవల కంపెనీగా ఉంది. ప్రధానంగా టాటా మోటార్స్‌తో పాటు జాగ్వార్ ల్యాండ్‌రోవర్, ఇతర టాటా సంస్థలకు సేవలందిస్తున్నది. గతేడాది నాటికి టాటా టెక్నాలజీస్ రూ. 407 కోట్ల నికర లాభాలను, రూ. 3,052 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది.



Next Story

Most Viewed