సుప్రీంకోర్టు భవిష్యత్తులో ఇలా పనిచేస్తుంది.. వివరించిన సీజేఐ చంద్రచూడ్

by Dishanational4 |
సుప్రీంకోర్టు భవిష్యత్తులో ఇలా పనిచేస్తుంది.. వివరించిన సీజేఐ చంద్రచూడ్
X

దిశ, నేషనల్ బ్యూరో : సుప్రీంకోర్టు డిజిటల్ డేటాను త్వరలోనే సురక్షితమైన క్లౌడ్ టెక్నాలజీలోకి బదిలీ చేస్తామని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు. సుప్రీంకోర్టు వజ్రోత్సవం సందర్భంగా ఆదివారం ప్రధాని మోడీ ఆవిష్కరించిన ‘డిజిటల్ సుప్రీంకోర్ట్ రిపోర్ట్స్’ వెబ్‌సైట్ రానున్న రోజుల్లో దేశ ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ వెబ్‌సైట్‌లో పొందుపరిచే తీర్పు కాపీలను డిజిటల్ ఫార్మాట్‌లో ప్రజలు ఉచితంగా చదువుకోవచ్చని సీజేఐ వెల్లడించారు. 1950 సంవత్సరం నుంచి ఇప్పటివరకు సుప్రీంకోర్టు విచారించిన 36,308 కేసుల కాపీలను 519 వాల్యూమ్‌లుగా చేసి డిజిటల్ ఫార్మాట్‌లో ఒకేచోట అందించడమే ‘డిజిటల్ సుప్రీంకోర్ట్ రిపోర్ట్స్’ వెబ్‌సైట్ ప్రత్యేకత అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వివరించారు. బుక్‌మార్క్ చేసుకునేలా యూజర్ ఫ్రెండ్లీగా, ఓపెన్ యాక్సెస్‌తో ఈ వెబ్‌సైట్‌లోని ఫైల్స్ అందుబాటులో ఉంటాయన్నారు.

న్యాయవ్యవస్థలో మహిళలకు పెరుగుతున్న అవకాశాలు

‘‘ఈరోజు ఒక ముఖ్యమైన సందర్భం.. రాజ్యాంగం ద్వారానే ప్రజలు మాకు ఈ సుప్రీంకోర్టును అందించారు. తోటి పౌరుల పట్ల పరస్పర గౌరవంతో మెలగాలనే అంశాన్ని భారత రాజ్యాంగం నొక్కి చెప్పింది’’ అని సీజేఐ డీవై చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. ‘‘యావత్ దేశంలోని కోర్టుల కేసుల విచారణకు సంబంధించిన సమాచారాన్ని సుప్రీంకోర్టు ఒకేచోటు నుంచి పర్యవేక్షించడానికి వీలు కల్పించే టెక్నలజీకల్ వార్‌రూమ్‌ను తెరవడానికి మేం సిద్ధంగా ఉన్నాం’’ అని ఆయన వెల్లడించారు. సుస్వాగతం యాప్ ద్వారా సుప్రీంకోర్టుకు వచ్చేవారికి ఇప్పటిదాకా 1.23 లక్షల పాస్‌లను డిజిటల్‌‌గా జారీ చేశామన్నారు. ‘‘న్యాయ వ్యవస్థలో మహిళలకు అవకాశాలు పెరుగుతున్నందుకు సంతోషంగా ఉంది. ఇప్పుడు జిల్లా న్యాయవ్యవస్థలో 36 శాతం మంది స్త్రీలు ఉన్నారు. ఇటీవల న్యాయ వ్యవస్థకు సంబంధించిన వివిధ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులలో 50 శాతం మందికిపైగా మహిళలే ఉన్నారు. జడ్జీలకు సహాయం చేసే లా క్లర్కులలోనూ 41 శాతం మంది మహిళలే ఉన్నారు’’ అని సీజేఐ తెలిపారు. ‘‘సుదీర్ఘ కాలం పాటు కేసుల పెండింగ్‌ వ్యవహారాలు, కేసుల వాయిదాల సంస్కృతి వంటి సమస్యల పరిష్కారానికి సమీప భవిష్యత్తులో తగిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది’’ అని ఆయన చెప్పారు.



Next Story

Most Viewed