ఎస్‌బీఐ, ఈసీలకు సుప్రీంకోర్టు రెండు కీలక ఆదేశాలు

by Dishanational4 |
ఎస్‌బీఐ, ఈసీలకు సుప్రీంకోర్టు రెండు కీలక ఆదేశాలు
X

దిశ, నేషనల్ బ్యూరో : ఎలక్టోరల్ బాండ్ల సమాచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించినా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) మరోసారి సుప్రీంకోర్టు ఆగ్రహాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఎలక్టోరల్ బాండ్ల ఆల్ఫా న్యూమరిక్‌ నంబర్లను ఈసీకి ఎస్‌బీఐ అందించకపోవడాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్ , న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, బీఆర్ గవాయ్, జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం తప్పుపట్టింది. ఎన్నికల బాండ్ల సమాచారం విడుదలపై మార్చి 11న తాము ఇచ్చిన ఆదేశాలను పూర్తిస్థాయిలో పాటించలేదంటూ ఎస్‌బీఐకి మొట్టికాయలు వేసింది. ‘‘ఎన్నికల బాండ్ల ఆల్ఫా న్యూమరిక్‌ నంబర్లు లేకపోవడంతో ఏయే కంపెనీ.. ఏయే రాజకీయ పార్టీలకు ఎంతమేర విరాళాలు ఇచ్చిందో స్పష్టంగా తెలియడం లేదు. బాండ్లతో ముడిపడిన అన్ని వివరాలను వెల్లడించాలని మేం గత తీర్పులో స్పష్టం చేశాం. అయినా మీరు ఈసీ ఆ సమాచారం ఎందుకు ఇవ్వలేదు?’’ అని ఎస్‌బీఐను దేశ సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. దీనిపై ఎస్‌బీఐకు నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు.. తదుపరి విచారణను మార్చి 18 (సోమవారం)కి వాయిదా వేసింది. ఆలోగా తమ ఆదేశాలు ఎందుకు అమలు చేయలేదో వివరణ ఇవ్వాలని ఎస్‌బీఐని ఆదేశించింది. ఎన్నికల బాండ్లకు సంబంధించిన అన్ని వివరాలను సోమవారం నాటికి ఈసీకి అందజేయాలని స్పష్టం చేసింది.

2019 ఏప్రిల్‌కు మునుపటి బాండ్లపై..

ఇక ఎన్నికల బాండ్లపై మార్చి 11న ఇచ్చిన తీర్పును కొంతమేర సవరించాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) సుప్రీంకోర్టులో మరో పిటిషన్ వేసింది. తాజాగా గురువారం రాత్రి విడుదలైన ఎన్నికల బాండ్ల సమాచారం 2019 ఏప్రిల్‌ 19 నుంచి 2024 ఫిబ్రవరి 15 మధ్యకాలానికి సంబంధించింది. 2019 ఏప్రిల్‌ 12కు ముందు జారీ అయిన ఎలక్టోరల్ బాండ్లు, వాటిని ఎన్‌క్యాష్‌ చేసుకున్న రాజకీయ పార్టీల వివరాలను ఈసీ అప్పట్లోనే రెండు సార్లు సీల్డ్‌ కవర్‌లో సుప్రీంకోర్టుకు సమర్పించింది. అయితే 2019 ఏప్రిల్‌ 12కు ముందు జారీ అయిన ఎన్నికల బాండ్ల సమాచారాన్ని కూడా విడుదల చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని మార్చి 11న సుప్రీంకోర్టు ఆదేశించింది. అప్పటి ఎలక్టోరల్ బాండ్ల కాపీలు ప్రస్తుతం తమ వద్ద లేవని.. గతంలో తాము సుప్రీంకు సమర్పించిన కాపీలనే తిరిగి ఇస్తే బహిర్గతం చేస్తామని కోర్టుకు ఈసీ తెలిపింది. దీనికి అంగీకరించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. గతంలో ఈసీ ఇచ్చిన ఎన్నికల బాండ్ల వివరాలను స్కాన్‌ చేసి డిజిటలైజ్‌ చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఆ తర్వాత ఒరిజినల్‌ డాక్యుమెంట్లను ఈసీకి అందించాలని నిర్దేశించింది. 2019 ఏప్రిల్‌కు మునుపటి ఎలక్టోరల్ బాండ్ల వివరాలను శనివారం (మార్చి 16న) సాయంత్రం 5 గంటల్లోగా వెబ్‌సైట్‌లో విడుదల చేయాలని ఈసీని దేశ సర్వోన్నత న్యాయస్థానం కోరింది.



Next Story

Most Viewed