- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత ఫార్మా చరిత్రలోనే అతిపెద్ద డీల్.. $11.75 బిలియన్లకు ‘ఆర్గానాన్’ను కైవసం చేసుకోనున్న సన్ ఫార్మా
ప్రముఖ ఫార్మా దిగ్గజం ‘సన్ ఫార్మా’, అమెరికాకు చెందిన ‘ఆర్గానాన్ అండ్ కో’ (Organon & Co.)ను 11.75 బిలియన్ డాలర్ల (ఎంటర్‌ప్రైజ్ వాల్యూ) భారీ ధరకు కొనుగోలు చేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: భారతీయ ఔషధ రంగంలోనే అత్యంత భారీ కొనుగోలు ఒప్పందం కుదిరింది. ప్రముఖ ఫార్మా దిగ్గజం ‘సన్ ఫార్మా’, అమెరికాకు చెందిన ‘ఆర్గానాన్ అండ్ కో’ (Organon & Co.)ను 11.75 బిలియన్ డాలర్ల (ఎంటర్‌ప్రైజ్ వాల్యూ) భారీ ధరకు కొనుగోలు చేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. ఈ ఒప్పందం ద్వారా సన్ ఫార్మా తన గ్లోబల్ మార్కెట్ స్థాయిని, వైద్య చికిత్సా విభాగాన్ని అనూహ్యంగా విస్తరించుకోనుంది. ఇది పూర్తిగా నగదు రూపంలో జరిగే లావాదేవీ అని, ఆర్గానాన్ షేరుకు 14 డాలర్ల చొప్పున చెల్లించనున్నట్లు సన్ ఫార్మా వెల్లడించింది.
సరికొత్త రంగాల్లోకి ప్రవేశం..
ఆర్గానాన్‌కు ప్రపంచవ్యాప్తంగా 140కి పైగా దేశాల్లో కార్యకలాపాలు, 50కి పైగా బ్రాండ్స్ ఉన్నాయి. ముఖ్యంగా మహిళల ఆరోగ్యం, సంతానోత్పత్తి (ఫెర్టిలిటీ), బయోసిమిలర్స్ రంగాల్లో ఈ సంస్థకు పటిష్టమైన స్థానం ఉంది. ఈ కొనుగోలుతో సన్ ఫార్మా కేవలం జనరిక్ మందులకే పరిమితం కాకుండా మహిళల ఆరోగ్య రంగాన్ని తన కొత్త ఇన్నోవేషన్ పిల్లర్‌గా మార్చుకోనుంది. ఈ విలీనం తర్వాత సన్-ఆర్గానాన్ వార్షిక ఆదాయం అమాంతం 12.4 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. సన్ ఫార్మా ప్రస్తుత (FY25) ఆదాయం 6.2 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు. అలాగే ఉమ్మడి ఎబిటా (EBITDA) 3.7 బిలియన్ డాలర్లకు పెరగనుంది.
భారీ కొనుగోలు కోసం నిధుల సమీకరణ..
ఇంత భారీ కొనుగోలు కోసం సన్ ఫార్మా తన వద్ద ఉన్న 2 నుంచి 2.5 బిలియన్ డాలర్ల నగదు నిల్వలను వినియోగించనుంది. మిగిలిన 9.25–9.75 బిలియన్ డాలర్లను బ్యాంకుల నుంచి రుణంగా తీసుకోనుందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆర్గానాన్‌కు ఉన్న బలమైన క్యాష్ ఫ్లో కారణంగా అప్పుల భారం త్వరగానే తగ్గుతుందని యాజమాన్యం ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ రెండు కంపెనీల అనుసంధానం ద్వారా రాబోయే 2 నుంచి 4 ఏళ్లలో సప్లై చైన్ ఆప్టిమైజేషన్, ఇతరత్రా ఖర్చుల తగ్గింపు రూపంలో 350 మిలియన్ డాలర్ల మేర ఆదా (synergies) అవుతుందని సంస్థ అంచనా వేస్తోంది.
పూర్తయ్యేది ఎప్పుడంటే..?
గతంలో రాన్‌బాక్సీ (2014) లాంటి సంస్థలను విజయవంతంగా విలీనం చేసుకున్న చరిత్ర సన్ ఫార్మాకు ఉంది. తాజా ‘ఆర్గానాన్’ డీల్.. వాటాదారులు, నియంత్రణ సంస్థల (రెగ్యులేటరీ) అనుమతుల అనంతరం 2027 ప్రారంభం నాటికి పూర్తి కానుందని భావిస్తున్నారు. మొత్తంగా చూస్తే.. ఈ ఒప్పందం పూర్తయ్యాక ప్రపంచవ్యాప్తంగా 24,000 మంది ఉద్యోగులతో, వినూత్నమైన ఔషధాల తయారీలో సన్ ఫార్మా తిరుగులేని గ్లోబల్ డ్రగ్‌మేకర్‌గా అవతరించనుంది.






