ఢిల్లీలో జంతర్‌మంతర్.. పుర్రెలతో దక్షణాది రైతుల నిరసన.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రెసిడెంట్

by Disha Web Desk 3 |
ఢిల్లీలో జంతర్‌మంతర్.. పుర్రెలతో దక్షణాది రైతుల నిరసన.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రెసిడెంట్
X

దిశ వెబ్ డెస్క్: ఢిల్లీలోని జంతర్‌మంతర్ దగ్గర తమిళనాడు రైతులు పుర్రెలతో వినూత్న రీతిలో నిరసన చేపాట్టారు. ఈ నేపథ్యంలో జాతీయ దక్షిణ భారత నదుల అనుసంధానం రైతు సంఘం తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు అయ్యా కన్న మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రధాని మోడీ తమని మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము మోడీకి వ్యతిరేకం కాదని, అలానే తాము ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదని తెలిపారు.

తాను ప్రధానిగా ఎన్నికైతే రైతులు పండించే పంటకు ఆదాయం రెట్టింపు చేస్తానని, అలానే నదులను అనుసంధానం చేస్తానని 2019 ఎన్నికల సమయంలో ప్రధాని మోడీ హామీ ఇచ్చారని తెలిపారు. కానీ ఇచ్చిన హామీలని మోడీ నిలుపుకోలేదని తెలిపారు. ఈ నేపథ్యంలో గిట్టుబాటు ధర కోసం రైతులు నిరసన చేశారని పేర్కొన్నారు. ఆ నిరసనలో జరిగిన పోలీసుల కాల్పుల్లో ఓ వ్యక్తి మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు.

మనం ప్రజాస్వామ్య దేశంలో నివసిస్తున్నప్పుడు, మన ప్రజాస్వామ్య హక్కులను మనం పొందే హక్కు మనకి ఉందని.. ఆ హక్కుల కోసం కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకైనా వెళ్లి పోరాడి తెచ్చుకునే సామర్ధ్యం తమకు ఉందని, కానీ పోలీసులు తమని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. గతంలో కూడా తాము ఢిల్లీకి రావడానికి రెండుమూడు సార్లు ప్రయత్నించినట్లు తెలిపారు.

అయితే తమ ప్రయత్నాలను ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనితో తాము తమిళనాడు హైకోర్టుతో పాటుగా ఢిల్లీ హైకోర్టును కూడా అశ్రయించినట్లు తెలిపారు. కాగా తమ సమస్యల పరిష్కారానికి నిరసన చేపట్టేందుకు ఈ నెల 23వ తేదీ నుండి 30వ తేదీ వరకు అనుమతి ఇవ్వాలని కోరామని, అయితే హైకోర్టు ఒక్క రోజే అనుమతి ఇచ్చిందని పేర్కొన్నారు.

కాగా తాము రెండు రోజులు చూస్తామని, ఈ లోపు కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక నిన్న తాము నిరసన ప్రదేశానికి చేరుకోగానే, అక్కడికి ఎవరిని అనుమతించమని నెహురు అనే పోలీసు హెడ్ కానిస్టేబుల్ నిరసనకారుల్లో ఇద్దరు వ్యక్తులను, అలానే ఓ మహిళను తోసేశారని.. అందుకు సంబంధించిన వీడియో కూడా తమ వద్ద ఉందని, అధికారం చేతిలో ఉందని ఇలా ప్రవర్తిస్తారా అని మండిపడ్డారు.

ప్రజాస్వామ్య దేశంలో ఎవరికీ రైతులను ఎటాక్ చేసే హక్కు లేదని, అయినా అతను తమపై ఎటాక్ చేశారని తెలిపారు. తాము మోడీకి వ్యతిరేకంగా లేమని, కేవలం తమకు సాయం చేయాల్సదిగా మోడీని అర్థిస్తున్నాంమని తెలిపారు. తాము ఏ పార్టీకి చెందిన వాళ్ళం కాదని 2014 ముందు గిట్టుబాటు ధర కోసం కాంగ్రెస్ ప్రభుత్వంతో కూడా పోరాడినట్లు తెలిపారు.

ఇప్పుడు మోడీ ప్రభుత్వంతో పోరాడుతున్నట్లు పేర్కొన్నారు. అయితే మోడీ రైతులను మోసం చేశారని ఆయన అన్నారు. ఎందుకంటే దేశంలో 140 కోట్ల మంది ప్రజలు ఉన్నారని, అయితే 140 కోట్ల మంది ప్రజల్లో 95 కోట్ల మంది రైతులే ఉన్నారని తెలిపారు. కాగా 95 కోట్ల మంది రైతుల్లో 90 కోట్ల మంది రైతులు హిందువులే అని పేర్కొన్నారు.

మోడీ మాటిమాటికీ తాను హిందువులకు సాయం చేస్తున్న అని చెబుతారని.. అయితే ఎందుకు 90 కోట్ల మంది రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగికి ఇచ్చే జీతం రూ. 100 పెంచితే మా పంటకు గిట్టుబాటు ధర రూ. 10 పెంచమని అర్దిస్తుంటే.. ఆయన మాత్రం కేవలం రూ. 3 పెంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక తమ దగ్గర ఉన్న పుర్రెలు గత పదేళ్లుగా ఆత్మహత్యలు చేసుకుని చనిపోయిన రైతులవి అని తెలిపారు. గత పది ఏళ్లలో లక్షమందికి పైగా బ్యాంకుల నుండి పంట కోసం రుణాలను తీసుకుని తిరిగి చెల్లించడం ఆలస్యం అయిన నేపథ్యంలో బ్యాంకు సిబ్బంది ఇళ్లకు వచ్చి, నీకు, నీ భార్యకు వేసుకోవడానికి బట్టలు కొనడానికి డబ్బులు ఉన్నాయి కానీ తీసుకున్న లోన్ కట్టడానికి డబ్బులు లేవా అని అవమానిస్తే ఆ అవమాన భారంతో రైతు ఆత్మహత్యలు చేసుకుని ప్రాణాలు కోల్పోయారని ఆయన భావోద్వేగానికి గురైయ్యారు. ఆ పుర్రెలు వాళ్ళవే అని కన్నీటి పర్యంతం అయ్యారు.



Next Story

Most Viewed