వందే భారత్ రైళ్ల ఆదాయంపై RTI దరఖాస్తు.. స్పందించిన మంత్రిత్వ శాఖ

by Disha Web Desk 17 |
వందే భారత్ రైళ్ల ఆదాయంపై RTI దరఖాస్తు.. స్పందించిన మంత్రిత్వ శాఖ
X

దిశ, నేషనల్ బ్యూరో: వందే భారత్ రైళ్లకు సంబంధించి ఎలాంటి ప్రత్యేక ఆదాయ రికార్డులను నిర్వహించడం లేదని మంత్రిత్వ శాఖ తాజాగా పేర్కొంది. వందే భారత్ రైళ్ల గురించిన వివరాల కోసం RTI చట్టం కింద దరఖాస్తు రాగా స్పందించిన రైల్వే శాఖ ఈ విధమైన ప్రకటన చేసింది. మధ్యప్రదేశ్‌కు చెందిన చంద్ర శేఖర్ గౌర్ గత రెండేళ్లలో వందేభారత్ రైళ్ల ద్వారా రైల్వే మంత్రిత్వ శాఖ ఎంత ఆదాయాన్ని ఆర్జించింది, ఇంకా ఇతర వివరాల కోసం RTI కింద దరఖాస్తు చేసుకోగా, మంగళవారం దీనికి ప్రతిస్పందనగా మంత్రిత్వ శాఖ, రైళ్ల వారీగా ఎలాంటి పోర్టబిలిటీ నిర్వహించబడదని, వందే భారత్ రైళ్లకు ప్రత్యేకంగా ఆదాయ రికార్డులను నిర్వహించడం లేదని తెలిపింది.

వందే భారత్ దేశంలోని మొట్టమొదటి సెమీ-హైస్పీడ్ రైలు, ఇది ఫిబ్రవరి 15, 2019న న్యూఢిల్లీ- వారణాసి మధ్య ప్రారంభమైంది. ప్రస్తుతం 102 వందే భారత్ రైళ్లు 24 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 284 జిల్లాలను కవర్ చేస్తూ 100 రూట్లలో నడుస్తున్నాయి. వందే భారత్ రైళ్లను ప్రారంభించినప్పటి నుంచి సోమవారం వరకు దాదాపు 2 కోట్ల మందికి పైగా ఈ రైళ్లలో ప్రయాణించారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో వందే భారత్ రైళ్లు ప్రయాణించిన దూరం భూమి చుట్టూ 310 రౌండ్లు ప్రయాణించడంతో సమానమని అధికారులు తెలియజేశారు.

అయితే దీనిపై చంద్ర శేఖర్ గౌర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వందే భారత్ రైళ్లలో ప్రయాణించిన వారి సంఖ్య, దూరాన్ని రైల్వే నిర్వహిస్తుందని, కానీ వాటి ఆదాయ ఉత్పత్తికి సంబంధించి అత్యంత కీలకమైన సమాచారాన్ని అందించడం లేదని అన్నారు. రైల్వే అధికారులు వందే భారత్ రైళ్లు ఒక సంవత్సరంలో ప్రయాణించిన దూరాన్ని భూమి చుట్టూ తిరిగే దానితో సమానమని లెక్కించగలరని, అయితే ఈ రైళ్ల నుండి సేకరించిన మొత్తం ఆదాయం మాత్రం చెప్పడం లేదని అన్నారు. ఆక్యుపెన్సీ విషయానికి వస్తే, గత ఏడాది అక్టోబర్‌లో ఆర్‌టిఐ కింద దాఖలు చేసిన మరో దరఖాస్తుకు స్పందించిన రైల్వే, వందే బారత్ రైళ్ల మొత్తం వినియోగం 92 శాతానికి పైగా ఉందని తెలిపింది.


Next Story