మొహల్లా క్లినిక్‌లలో మందుల కొరత లేకుండా చూడండి: కేజ్రీవాల్ రెండో ఉత్తర్వు జారీ

by Dishanational2 |
మొహల్లా క్లినిక్‌లలో మందుల కొరత లేకుండా చూడండి: కేజ్రీవాల్ రెండో ఉత్తర్వు జారీ
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టై ఈడీ కస్టడీలో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ రెండో ప్రభుత్వ ఉత్తర్వును జారీ చేశారు. ఢిల్లీలోని మొహల్లా క్లినిక్‌లలో మందుల కొరత లేకుండా చూడాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖను ఆదేశించినట్టు మంత్రి సౌరబ్ భరద్వాజ్ తెలిపారు. ప్రజలకు ఉచితంగా పరీక్షలు చేసి మందులు అందించాలని సూచించినట్టు వెల్లడించారు. ‘ఢిల్లీ ప్రజల ఆరోగ్య పరిస్థితిపై కేజ్రీవాల్ ఆవేదన చెందారు. క్లినిక్‌లలో చేస్తున్న పరీక్షల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సీఎంకు సమాచారం అందింది. దీంతో ఈ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆర్డర్స్ జారీ చేశారు’ అని మీడియా సమావేశంలో భరద్వాజ్ వెల్లడించారు. దీనితో ఢిల్లీ ప్రజలకు కేజ్రీవాల్ భరోసా ఇచ్చారని తెలిపారు.

కాగా, కేజ్రీవాల్ ఈడీ కస్టడీ నుంచి మొదటి ఉత్తర్వును మార్చి 24వ తేదీన జలవనరుల శాఖకు పంపించారు. నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో ట్యాంకర్లు ఏర్పాటు చేయాలని మంత్రి అతిశిని ఒక నోట్ ద్వారా ఆదేశించారు. దీనిని ఈసీ సీరియస్‌గా తీసుకుంది. కస్టడీలో ఉన్న కేజ్రీవాల్‌కు కాగితం ఎలా వచ్చింది అనేదానిపై ఈడీ విచారణకు దిగింది. కోర్టు ఆదేశాల మేరకు కస్టడీ నుంచి ఆదేశాలు జారీ చేసే హక్కు ఏ ముఖ్యమంత్రికైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్ రెండో ఉత్తర్వులు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఆప్ నిరసన..ఢిల్లీలో భారీ భద్రత

కేజ్రీవాల్ అరెస్టును నిరసిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రధాని నివాసాన్ని ముట్టడించేందుకు పిలుపునిచ్చింది. దీనికి అనుమతి లేదని పోలీసులు తెలపడంతో పలు చోట్ల ఆప్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో ఢిల్లీ వ్యాప్తంగా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. కొన్ని రూట్లలో ట్రాఫిక్‌ను మళ్లించారు. తుగ్లక్ రోడ్, సఫ్దర్‌జంగ్ రోడ్, కెమాల్ అటాతుర్క్ మార్గ్‌లలో వాహనాల పార్కింగ్ కు అనుమతించడం లేదు. మరోవైపు కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత ఆప్ సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభించింది. ‘మైన్ భీ కేజ్రీవాల్’ పేరుతో జరుగుతున్న ఈ ప్రచారంలో పార్టీ నేతలు తమ సోషల్ మీడియా ఖాతాల్లో కేజ్రీవాల్ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు.

Next Story

Most Viewed