కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సావిత్రి జిందాల్

by Disha Web Desk 17 |
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సావిత్రి జిందాల్
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలోనే అత్యంత ధనిక మహిళగా పేరొందిన సావిత్రి జిందాల్ లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఆమె కుమారుడు మాజీ ఎంపీ నవీన్ జిందాల్ కాంగ్రెస్‌‌ను వీడి బీజేపీలో చేరిన కొద్ది రోజులకే సావిత్రి జిందాల్ రాజీనామా చేయడం గమనార్హం. నేను 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా హిసార్ ప్రజలకు ప్రాతినిధ్యం వహించాను, అలాగే మంత్రిగా హర్యానా రాష్ట్రానికి నిస్వార్థంగా సేవ చేశాను. కుటుంబ సభ్యుల సలహామేరకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. నాకు మద్దతు ఇచ్చినందుకు కాంగ్రెస్ నాయకత్వానికి, కార్యకర్తలకు కృతజ్ఞతలు అని ఆమె ఎక్స్‌లో అన్నారు.

ఆమె భర్త జిందాల్ గ్రూప్ వ్యవస్థాపకులు ఓం ప్రకాష్ జిందాల్ 2005లో విమాన ప్రమాదంలో మృతి చెందిన తరువాత సావిత్రి జిందాల్ వ్యాపార బాధ్యతలు తీసుకున్నారు. ఆమె 10 ఏళ్లు ఎమ్మెల్యేగా, 2013లో హర్యానా క్యాబినెట్ మంత్రిగా, 2010 వరకు విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేశారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయారు. సావిత్రి జిందాల్ భారత్‌లో అత్యంత సంపన్న మహిళగా ఉన్నారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, ఆమె నికర సంపద రూ.2.47 లక్షల కోట్లు(29.6 బిలియన్ డాలర్లు). ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్ల జాబితాలో సావిత్రి జిందాల్ 56వ స్థానంలో ఉన్నారు.


Next Story