పెరుగుతున్న ఉష్ణోగ్రతలు..ఆ నాలుగు రాష్ట్రాలకు ఐఎండీ వార్నింగ్

by Dishanational2 |
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు..ఆ నాలుగు రాష్ట్రాలకు ఐఎండీ వార్నింగ్
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో ఉష్ణోగ్రతలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఎండల తీవ్రత ఎక్కువవుతోంది. ఈ నేపథ్యంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బిహార్ రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. ఈ రాష్ట్రాల్లో రాబోయే ఐదు రోజులు తీవ్రమైన వడగాల్పులు ఉంటాయని తెలిపింది. అంతేగాక ఆదివారం ఆయా రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత 40డిగ్రీలు దాటింది. జార్ఖండ్‌లోని తూర్పు సింగ్‌భూమ్‌లోని బహరగోరాలో దేశంలోనే అత్యధికంగా 46 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ నెల 26వరకు ఇలాంటి పరిస్థితులు ఉండనున్నాయని అంచనా వేసింది. మరోవైపు ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌ను అధిగమించే అవకాశం ఉందని పేర్కొంది.

వేడిగాలుల కారణంగా ఒడిశా ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు ఏప్రిల్ 25 నుంచి వేసవి సెలవులను ప్రకటించింది . అదనంగా ఏప్రిల్ 22 నుంచి 24 మధ్య మూడు రోజుల పాఠశాల సమయాలను మార్చింది. జార్ఖండ్‌లోనూ పాఠశాలల సమయాల్లో మార్పులు చేసింది. అలాగే పలు రాష్ట్రాల్లో వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. హిమాచల్ ప్రదేశ్‌లో హిమపాతం, వర్షాలు 27వరకు కొనసాగుతాయని తెలిపింది. ఈ వారం ఢిల్లీలో ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెల్సియస్‌ కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది.



Next Story

Most Viewed