కాంగ్రెస్ అధికారంలోకి రాగానే జీఎస్టీ ఎత్తేస్తాం.. రాహుల్ గాంధీ

by Dishafeatures2 |
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే జీఎస్టీ ఎత్తేస్తాం.. రాహుల్ గాంధీ
X

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే జీఎస్టీని ఎత్తేస్తామని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ అన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బెళగావి జిల్లాలోని రామ్ దుర్గ్ లో జరిగిన కాంగ్రెస్ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలపై విరుచుకుపడ్డారు. జీఎస్టీ అనేది చాలా క్లిష్టమైన పన్ను విధానమని, దేశంలోని ధనవంతులకు మేలు చేయడానికే ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకొచ్చిందని అన్నారు. ట్యాక్స్ ఎలా ఫైల్ చేయాలో, ఎప్పుడు ఫైల్ చేయాలో దేశంలోని సగం మందికి తెలియదని చెప్పారు. పెద్ద వ్యాపారులకు అకౌంటెంట్లు ఉంటారని, కానీ చిన్న వ్యాపారులకు అలాంటి అవకాశం లేక వ్యాపారాలను మూసివేసుకుంటున్నారని రాహుల్ తెలిపారు. కేంద్రంలో తమ ప్రభుత్వం ఏర్పడగానే జీఎస్టీని ఎత్తివేసి దాని స్థానంలో దేశం మొత్తం ఒకే ట్యాక్స్ విధానాన్ని తీసుకొస్తామని పేర్కొన్నారు.

ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఫోకసంతా ఇద్దరు ముగ్గురు బిలియనీర్ల మీద ఉందే తప్ప రైతులు, కార్మికులు, చిరు వ్యాపారుల వంటి వారి మీద లేదని ఆరోపించారు. బిలియనీర్లకు బ్యాంకుల్లో సులభంగా లోన్ లభిస్తుందని, వాళ్లు కట్టలేని పరిస్థితులు ఉంటే ప్రభుత్వం వాటిని మాఫీ చేస్తుందని అన్నారు. కానీ రైతులకు సంబంధించిన లోన్లు మాత్రం ఎప్పటికీ మాఫీ కావు అని రాహుల్ అన్నారు. తమ ప్రభుత్వం రాగానే కార్మికులు, రైతులు, నిరుద్యోగులు, చిరు వ్యాపారుల సంక్షేమం కోసం పథకాలు తీసుకొస్తామని రాహుల్ గాంధీ తెలిపారు.

Also Read..

ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వంట బాగా చేస్తారు: Rahul Gandhi


Next Story