ప్రియాంకా గాంధీ జీ.. రాయ్‌బరేలీ పిలుస్తోంది: కాంగ్రెస్ నేతకు మద్దతుగా పోస్టర్లు

by Dishanational2 |
ప్రియాంకా గాంధీ జీ.. రాయ్‌బరేలీ పిలుస్తోంది: కాంగ్రెస్ నేతకు మద్దతుగా పోస్టర్లు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ లోక్‌సభ సెగ్మెంట్‌పై ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో సుమారు రెండు దశాబ్దాలుగా సోనియా గాంధీ ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. అయితే అనారోగ్య కారణాల వల్ల ఆమె పోటీ నుంచి తప్పుకుని రాజ్యసభకు ఎన్నికైంది. దీంతో అప్పటి నుంచి కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ రాయ్‌బరేలీలో బరిలోకి దిగుతారని ఊహాగానాలు వెలువడ్డాయి. తాజాగా రాయ్‌బరేలీ నుంచి ప్రియాంక పోటీ చేయాలని ఆమె మద్దతు దారులు పోస్టర్లు వేశారు. ‘కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్లండి. రాయ్‌బరేలీ పిలుస్తోంది. ప్రియాంక గాంధీ జీ, దయచేసి రండి’ అని పోస్టర్లలో పేర్కొన్నారు. పోస్టర్లపై సోనియా గాంధీ, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ, స్వాతంత్ర్య సమరయోధుడు చంద్రశేఖర్ ఆజాద్‌ల ఫోటోలు ఉన్నాయి. అయితే రాయ్ బరేలీ నుంచి కాంగ్రెస్ పార్టీ ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు. ఈ నేపథ్యంలోనే పోస్టర్లు వేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

కాంగ్రెస్ పార్టీకి రాయ్‌బరేలీ ప్రతిష్టాత్మక స్థానంగా కొనసాగుతోంది. ఇక్కడి నుంచి మాజీ ప్రధాని ఇంధిరా గాంధీ సైతం ప్రాతినిధ్యం వహించారు. అయితే సిట్టింగ్ ప్రధానిగా ఉన్న ఇందిరా గాంధీ 1977లో ఈ స్థానం నుంచి ఓడిపోయారు. లోక్‌సభకు పోటీ చేసి ఓడిపోయిన ఏకైక ప్రధానిగా ఆమె నిలిచింది. అంతేగాక 2014, 2019లో బీజేపీ హవా కొనసాగినప్పటికీ ఈ స్థానం నుంచి కాంగ్రెస్ విజయం సాధించింది. దీంతో ఈ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న సోనియా గాంధీ పోటీకి దూరంగా ఉండటంతో ప్రస్తుతం పోటీ చేసేది ఎవరనే దానిపై ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ ప్రియాంకా గాంధీని బరిలోకి దింపుతుందా లేక మరెవరికైనా అవకాశం ఇస్తుందా అనేది వేచి చూడాలి. అయితే కాంగ్రెస్ శ్రేణులు మాత్రం గాంధీ కుటుంబ సభ్యులే పోటీ చేయాలని డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.


Next Story