కాంగ్రెస్ నుంచి ముఖ్య నేతల వలసలపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

by Dishanational4 |
కాంగ్రెస్ నుంచి ముఖ్య నేతల వలసలపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో : రైతన్నలు నిరసనలతో దేశ రాజధాని ఢిల్లీ బార్డర్‌ను హోరెత్తిస్తున్న వేళ ప్రధానమంత్రి నరేంద్రమోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘రైతులకు మేలు చేసే సంక్షేమ పథకాలపై మా ప్రభుత్వం పని చేస్తోంది. గతంలో అన్నదాతలకు బ్యాంకులు రుణాలు ఇచ్చేవి కాదు. కానీ దానిపై మేం వారికి గ్యారంటీ ఇచ్చాం’’ అని మోడీ తెలిపారు. హర్యానాలోని రేవాడీలో ఎయిమ్స్‌కు శంకుస్థాపన చేసిన అనంత‌రం శుక్రవారం మధ్యాహ్నం నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగించారు. రైతుల సంక్షేమానికి క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని ఆయన స్ప‌ష్టం చేశారు. ప‌దేళ్ల యూపీఏ హ‌యాంలో రైతుల‌కు చేసిందేమీ లేద‌ని దుయ్య‌బ‌ట్టారు. శ్రీరాముడంటే ఊహ, అయోధ్యలో ఆలయనిర్మాణం వద్దన్న వాళ్లే ఇప్పుడు ‘జై సీతారామ్‌’ అని నినదిస్తున్నారని మోడీ ఎద్దేవా చేశారు. ఆర్టికల్‌ 370 రద్దుకు దశాబ్దాల పాటు కాంగ్రెస్‌ అడ్డంకులు సృష్టించిందని, కానీ తమ ప్రభుత్వం దానిపై గ్యారంటీ ఇచ్చి నెరవేర్చిందని గుర్తుచేశారు.

రూ.9,750 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

‘‘గత పదేళ్లలో భారత్‌ ఎన్నో నూతన శిఖరాలను అధిరోహించింది. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా మన దేశాన్ని అమితంగా గౌరవిస్తున్నారు. 11వ స్థానంలో ఉన్న మన దేశం.. ఐదో అతిపెద్ద ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదిగింది. ఇదంతా మీ ఆశీర్వాదం వల్లే సాధ్యమైంది. మూడోసారి పాలనలో దేశాన్ని మూడో ఆర్థిక శక్తిగా అభివృద్ధి చేసేందుకు మీ ఆశీస్సులు కావాలి’’ అని ప్రజలను మోడీ కోరారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 400కుపైగా స్థానాలను గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని హర్యానా పర్యటనలో భాగంగా రూ.9,750 కోట్లకుపైగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. రూ.5,450 కోట్లతో అభివృద్ధి చేయనున్న గురుగావ్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు మోడీ శంకుస్థాపన చేశారు.

మేడిన్ ఇండియాకు వాళ్లు మద్దతునివ్వరు

అంతకుముందు శుక్రవారం ఉదయం రాజస్థాన్‌లో జరిగిన ‘వికసిత్ భారత్ వికసిత్ రాజస్థాన్’ కార్యక్రమాన్ని ఉద్దేశించి వర్చువల్‌గా ప్రధాని మోడీ ప్రసంగించారు. 2014 ముందు దేశం దారుణమైన స్థితిలో ఉండేదని ఆయన విమర్శించారు. బాంబు పేలుళ్లు, స్కామ్‌లు తప్ప కాంగ్రెస్ హయాంలో జరిగిందేమీ లేదని మండిపడ్డారు. ఆ పార్టీకి దూరదృష్టి లేకపోవడం వల్లే దేశం చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. ఒక్కటంటే ఒక్క సానుకూలమైన పథకాన్ని కాంగ్రెస్ పార్టీ దేశంలో తీసుకురాలేకపోయిందని మోడీ అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలో దేశవ్యాప్తంగా విద్యుత్‌కు లోటు ఉండేదని విమర్శించారు. రాజస్థాన్‌కు కాంగ్రెస్ ఇచ్చిన దానికన్నా ఆరు రెట్లు ఎక్కువగా బీజేపీ ఇచ్చిందని ప్రధాని వెల్లడించారు. తనను తిట్టడం తప్ప కాంగ్రెస్ పార్టీకి మరో ఎజెండా లేదని మోడీ వ్యాఖ్యానించారు. వికసిత్ భారత్ పేరు పలకడానికి కూడా ఆ పార్టీ నేతలకు నోరు రావడం లేదన్నారు. వోకల్ ఫర్ లోకల్, మేడిన్ ఇండియా నినాదానికీ వాళ్లు మద్దతునివ్వరని పేర్కొన్నారు. ‘‘మోడీ విరోధ్, ఘోర్ మోడీ విరోధ్ అనే ఎజెండాతోనే కాంగ్రెస్ పనిచేస్తోంది. అందుకే ఆ పార్టీలోని కీలక నేతలంతా వెళ్లిపోతున్నారు. ప్రస్తుతం ఒక్క కుటుంబమే అందులో మిగిలిపోయింది. బంధుప్రీతి అనే విష వలయంలో కాంగ్రెస్ చిక్కుకుంది’’ అని మోడీ కామెంట్ చేశారు.



Next Story

Most Viewed