ఐఐటీకి ఆ నిబంధన తొలగింపునకు సుప్రీం నో

by Disha Web Desk 17 |
ఐఐటీకి ఆ నిబంధన తొలగింపునకు సుప్రీం నో
X

న్యూఢిల్లీ: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో ప్రవేశానికి 12వ తరగతిలో కనీసం 75% మార్కులు ఉండాలన్న నిబంధన ఉంది. దీన్ని తొలగించాలని ఆదేశించాలంటూ చందన్ కుమార్ తదితరులు దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టేసింది. ఇది విద్యారంగానికి సంబంధించిన అంశమని, దీనిపై విద్యానిపుణులే నిర్ణయం తీసుకోవడం సరైనదని న్యాయమూర్తులు సుధాన్షు ధులియా, కె.వి.విశ్వనాథన్ లతో కూడిన వెకేషన్ బెంచ్ అభిప్రాయపడింది.

తమ క్లయింట్ జేఈఈ మెయిన్స్ లో 92% కంటే ఎక్కువ స్కోరు సాధించారని, జేఈఈ అడ్వాన్స్‌కు హాజరయ్యేందుకు అర్హులని.. కానీ 12వ తరగతి బోర్డు పరీక్షల్లో 75% మార్కులు లేకపోవడంతో ఐఐటీలో అడ్మిషన్ పొందలేని పరిస్థితి నెలకొందని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు.

కొవిడ్ సమయంలో 75% నిబంధనను తొలగించారని, ఇప్పుడు ఆ నిబంధనను మళ్లీ పెట్టడంతో కొందరు విద్యార్థులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ.. 75% నిబంధన గతంలోనూ ఉన్నందున తొలగించాలని ఆదేశించలేమని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు.



Next Story

Most Viewed