పదేళ్లలో ఐదో జంప్.. గోడ మీద పిల్లిలా నితీశ్ !

by Dishanational4 |
పదేళ్లలో ఐదో జంప్..  గోడ మీద పిల్లిలా నితీశ్ !
X

దిశ, నేషనల్ బ్యూరో: నితీశ్ కుమార్.. జాతీయ రాజకీయాల్లో ప్రస్తుతం బాగా ట్రెండ్ అవుతున్న పేరు ఇది. బిహార్ సీఎంగా ఉన్న ఈయన పొలిటికల్ సర్కస్ ఫీట్లను చూసి అందరూ నోర్లు వెళ్లబెడుతున్నారు. నిన్నమొన్నటిదాకా ఇండియా కూటమికి మూలస్తంభమైన కన్వీనర్ పదవి కోసం పాకులాడిన నితీశ్.. ఇప్పుడు ఎకాఎకిన ఇండియా కూటమి బద్ధ శత్రువైన ఎన్డీఏ (నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్) గూటికి చేరబోతున్నారు. ఇప్పటిదాకా బిహార్‌లో అధికారంలో ఉన్న మహా ఘట్‌బంధన్ కూటమికి ఆయన బైబై చెప్పేయనున్నారు. ఆ సర్కారును చేతులారా కూల్చేయనున్నారు. జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ ఆకస్మిక యూటర్న్‌తో లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ ఆర్జేడీతో పాటు కాంగ్రెస్ షాక్‌కు గురయ్యాయి. మరో సంచలన విషయం ఏమిటంటే.. ఈ ఆదివారం రోజే (జనవరి 28న) నితీశ్ కుమార్ బీజేపీతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి, బిహార్ ముఖ్యమంత్రిగా ఏడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారట. సడెన్ యూటర్న్‌లతో ప్రకంపనలను క్రియేట్ చేస్తుండటం వల్లే బిహార్ రాజకీయ వర్గాల్లో నితీశ్‌ను ‘పాల్తూ రామ్’, ‘పాల్తూ కుమార్’ అని పిలుస్తుంటారు. గత పదేళ్ల బిహార్‌ రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తే.. మెజారిటీ బీజేపీకి వచ్చినా.. ఆర్జేడీకి వచ్చినా సీఎం అవుతున్నది మాత్రం నితీశ్ కుమారే అని స్పష్టంగా తెలిసిపోతోంది. 2013 నుంచి ఇప్పటివరకు కూటములు మారడం నితీశ్‌కు ఇది ఐదోసారి.

ఐదు జంప్‌లు ఇలా..

* 2013 సంవత్సరం వరకు దాదాపు 17 ఏళ్ల పాటు నితీశ్ కుమార్ ఎన్డీఏ కూటమితోనే ఉన్నారు. అయితే 2013లో ఎన్డీఏ కూటమి తరఫున ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోడీ పేరును ప్రకటించాక.. ఆయన ఎన్డీఏకు కటీఫ్ చెప్పారు. ఎన్డీఏ కూటమి నుంచి పీఎం అయ్యే ఛాన్స్ వస్తుందని ఆశించి భంగపడటంతో అప్పట్లో అలా నితీశ్ జంప్ అయ్యారు.

* 2015లో నితీశ్‌కు చెందిన జేడీయూ.. కాంగ్రెస్, ఆర్జేడీలతో కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచింది. అప్పట్లో కూడా బిహార్‌లోని 243 అసెంబ్లీ సీట్లలో 80 లాలూ పార్టీ ఆర్జేడీ గెల్చుకుంది. అయినా సీఎం అయింది నితీశే. ఆ తర్వాత రెండేళ్లకే (2017లో) ఆయన జంప్ అయ్యారు. కూటమిలోని ఆర్జేడీ అవినీతికి పాల్పడుతోందనే ఆరోపణ చేసిన నితీశ్.. సింపుల్‌గా బైబై చెప్పి ఎన్డీఏలోకి వెళ్లిపోయారు.

* 2017లో ఎన్డీఏ గూటిలో చేరిన నితీశ్.. మోడీ హవా ఫలితంగా 2019 బిహార్ లోక్‌సభ ఎన్నికల్లో లబ్ధి పొందారు. 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ 75 సీట్లలో గెలుపుతూ బిహార్‌లో అతిపెద్ద పార్టీగా లాలూ పార్టీ ఆర్జేడీ అవతరించింది. అయినా బీజేపీతో కలిసి నితీశ్ సర్కారును ఏర్పాటుచేసి సీఎం అయ్యారు.

* 2020 నుంచి 2022 వరకు బిహార్‌లో సాఫీగానే నడిచిన ఎన్డీఏ సర్కారు చివరకు నితీశ్ జంపింగ్ కారణంగా కూలిపోయింది. 2022 సంవత్సరంలో నితీశ్ కుమార్ తన వైఖరిని మార్చుకొని ఆర్జేడీ పంచన చేరారు. బీజేపీ తనకు వ్యతిరేకంగా కుట్ర చేస్తోందని, జేడీయూ ఎమ్మెల్యేలను తనపై తిరుగుబాటుకు ఉసిగొల్పుతోందని ఆ సందర్భంగా నితీశ్ ఆరోపించారు.

* తాజాగా ఇప్పుడు మరోసారి(ఐదో దఫా) కూడా నితీశ్ ప్లేటు ఫిరాయించారు. ఆర్జేడీ, కాంగ్రెస్‌తో కలిసి బిహార్‌లో 2022 సంవత్సరంలో ఏర్పాటుచేసిన మహా ఘట్‌బంధన్ కూటమికి గుడ్ బై చెప్పి.. ఎన్డీఏకు జై కొట్టి అందరినీ ఆయన ఆశ్చర్యపరిచారు.

బలం.. బలగం ?

బిహార్ అసెంబ్లీలో మొత్తం 243 మంది సభ్యులు ఉన్నారు. ఈ రాష్ట్రంలో సర్కారు ఏర్పాటుకు 122 మంది ఎమ్మెల్యేల బలం అవసరం. ఇందులో ఆర్జేడీకి 79 సీట్లు ఉన్నాయి. నితీశ్ కుమార్‌కు కేవలం 45 సీట్లు ఉండగా.. బీజేపీ వద్ద 82 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందుకే వచ్చే ఆదివారం రోజున బీజేపీతో కలిసి నితీశ్ కుమార్ పార్టీ జేడీయూ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని తెలుస్తోంది.

భారతరత్న ప్రకటించిన కొన్నిరోజుల్లోనే..

లాలూప్రసాద్ యాదవ్ పార్టీ ఆర్జేడీతో ఏర్పడిన విభేదాల వల్లే మళ్లీ ఎన్డీఏ వైపు నితీశ్ చూశారనే చర్చ జరుగుతోంది. అయితా ఈ పరిణామానికి ఇంకో కోణం కూడా ఉంది. బిహార్‌తో ముడిపడిన ఒక తాజా అంశంతోనూ నితీశ్ నిర్ణయాన్ని ముడిపెట్టి చూడాల్సి ఉంటుందని పలువురు రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్‌కు కేంద్ర సర్కారు భారతరత్న ప్రకటించిన కొన్ని రోజుల్లోనే నితీశ్ ఎన్డీఏ వైపుగా యూటర్న్ తీసుకోవడం గమనార్హం. ఈ స్వల్ప వ్యవధిలోనే చాలా జరిగిపోయాయి. కర్పూరీ ఠాకూర్‌కు భారతరత్న ఇవ్వాలని తాము చాలాసార్లు అడిగినా కాంగ్రెస్ పట్టించుకోలేదని నితీశ్ విమర్శలు గుప్పించారు. ఆ మరుసటి రోజే తమ ఎమ్మెల్యేలను పాట్నాకు పిలిపించి సమావేశమయ్యారు. అనంతరం నితీశ్ ఢిల్లీకి వెళ్లి బీజేపీ అగ్రనేతలతో భేటీ అయ్యారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. ఇంత వేగంగా రాజకీయ పరిణామాలు మారడం అంత సులువు కాదని.. దీనికోసం చాలాముందు నుంచే తెరవెనుక హోం వర్క్ జరిగి ఉంటుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.



Next Story

Most Viewed