ఎల్ఓసీ వద్ద మరోసారి పాక్ డ్రోన్స్ కలకలం: అడ్డుకున్న భారత సైన్యం

by Dishanational2 |
ఎల్ఓసీ వద్ద మరోసారి పాక్ డ్రోన్స్ కలకలం: అడ్డుకున్న భారత సైన్యం
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో మరోసారి పాక్ డ్రోన్లు మోహరించడం కలకలం రేపింది. శుక్రవారం ఉదయం 6 గంటల టైంలో మెంధార్‌లోని బల్నోయి ప్రాంతంలోకి రెండు పాక్ డ్రోన్లు వచ్చాయి. దీంతో నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వద్ద రక్షణగా ఉన్న ఆర్మీ దళాలు డ్రోన్లపైకి కాల్పులు జరిపినట్టు అధికారులు తెలిపారు. అదే టైంలో గుల్పూర్ సెక్టార్‌పై రెండు డ్రోన్లు సంచరించినట్టు పేర్కొన్నారు. అయితే సైనికుల కాల్పుల తర్వాత బాల్నోయ్-మెంధార్, గుల్పూర్ సెక్టార్లలోని భారత భూభాగంపై కొద్దిసేపు తిరిగిన తర్వాత పాకిస్తాన్ వైపుకు తిరిగి వెళ్లినట్టు వెల్లడించారు. వెంటనే భద్రతా బలగాలు ఆయా ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. జమ్మూ కశ్మీర్‌లోకి మాదక ద్రవ్యాలు, ఆయుధాలను రవాణా చేయడానికి పాకిస్తాన్ డ్రోన్‌లను ఉపయోగిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, ఈ నెల12న మెంధార్ సెక్టార్‌లోని మాన్‌కోట్ ప్రాంతంలోనూ పాక్ డ్రోన్ కదలికను గుర్తించిన ఆర్మీ దళాలు దానిపై కాల్పులకు తెగపడ్డాయి.

కశ్మీర్‌లో హై అలర్ట్

ఎల్ఓసీ వద్ద డ్రోన్లు మోహరించడం, అంతేగాక గురువారం పూంచ్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో సైన్యం అప్రమత్తమైంది. జమ్మూ కశ్మీర్‌లో హై అలర్ట్ ప్రకటించింది. అయితే ఫైర్ ఆక్సిడెంట్ సమీపంలో ఎటువంటి అనుమానాస్పద కదలికలు లేవని భద్రతా దళాలు గుర్తించాయి. అయినప్పటికీ ఇటీవలి కాలంలో పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదులు చొరబాటు ప్రయత్నాలకు భద్రతా బలగాల దృష్టిని మరల్చేందుకు ఇటువంటి వ్యూహాలను ప్రయోగిస్తుండటంతో సైన్యం అలర్ట్ అయింది. కాగా, ఆయుధాలు మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై సమాచారం ఇచ్చిన వారికి రూ.3లక్షల నగదు బహుమతి అందిస్తామని కశ్మీర్ పోలీసులు ప్రకటించిన విషయం తెలిసిందే. వరుసగా కశ్మీర్ సరిహద్దుల్లో డ్రోన్లు మోహరించడంతో ఎల్ఓసీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Next Story

Most Viewed