ఆహ్వానం అందలేదు : రాహుల్ యాత్రపై అఖిలేష్ కీలక వ్యాఖ్యలు

by Dishanational4 |
ఆహ్వానం అందలేదు : రాహుల్ యాత్రపై అఖిలేష్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో : మమతా బెనర్జీ (టీఎంసీ), అరవింద్ కేజ్రీవాల్‌ (ఆప్) ఇచ్చిన షాక్‌ నుంచి కోలుకోలేని స్థితిలో ఉన్న కాంగ్రెస్‌కు.. సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ మరో ఝలక్ ఇచ్చారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ తలుపులు ఇంకా తమ కోసం తెరుచుకోలేదని కామెంట్ చేశారు. ‘‘రాహుల్ గాంధీ యాత్ర బెంగాల్ నుంచి బిహార్‌లోకి.. బిహార్ నుంచి జార్ఖండ్‌లోకి ప్రవేశించింది. అయినా ఇప్పటికీ నాకు మాత్రం ఆహ్వానం అందలేదు’’ అని అఖిలేష్ వ్యాఖ్యానించారు. ‘రాహుల్ గాంధీకి సంబంధించి యూపీలో నిర్వహించబోయే చాలా పెద్ద కార్యక్రమాలకు మమ్మల్ని ఆహ్వానించకపోవడమే అసలు సమస్య.. అలాంటప్పుడు మా అంతట మేమే ఆహ్వానాన్ని ఎలా అడుగుతాం?’’ అని ఆయన పేర్కొన్నారు. ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ ఉత్తరప్రదేశ్‌లోకి ప్రవేశించగానే దానిలో మీరు కూడా పాల్గొంటారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ అఖిలేష్ పై వ్యాఖ్యలు చేశారు. ఇక యూపీలో ఇప్పటికే దాదాపు డజనుకుపైగా లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల పేర్లను సమాజ్ వాదీ పార్టీ ప్రకటించింది. ఓ వైపు సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్‌తో చర్చలు జరుగుతుండగానే.. మరోవైపు అభ్యర్థుల పేర్లను అఖిలేష్ అండ్ టీమ్ విడుదల చేస్తుండటం పొలిటికల్ సస్పెన్స్‌కు తెరతీస్తోంది.


Next Story