వైద్య వృత్తిపై అపోహలు.. వాస్తవాలు.. ఇవీ

by Dishanational4 |
వైద్య వృత్తిపై అపోహలు.. వాస్తవాలు.. ఇవీ
X

దిశ, నేషనల్ బ్యూరో : వైద్యుడిని దేవుడి తర్వాత దేవుడిగా చెబుతుంటారు. రోగికి ఎంతో విలువైన చికిత్సలు చేసి ప్రాణాలు నిలబెట్టే దైవ స్వరూపంలా డాక్టర్‌ను భావిస్తారు. ఇంతేకాదు వైద్య వృత్తిపై ప్రజలకు ఇంకా చాలా అపోహలు ఉంటాయి. అటువంటి 7 ప్రధానమైన అపోహలను, అసలు వాస్తవాలను ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

1. అపోహ : వైద్య వృత్తి చాలా గొప్పది.

వాస్తవం : వైద్య వృత్తి ఒక్కటే కాదు.. ప్రతి వృత్తి కూడా గొప్పదే. ఉపాధ్యాయుడు, సైనికుడు, టైలర్, దుకాణదారుడు ఇలా చిత్తశుద్ధితో శ్రమించి చేసే అన్ని పనులు కూడా గొప్పవే.

2. అపోహ : అజాగ్రత్తగా ఉన్న వైద్యుడు ఒకరిని చంపగలడు.

వాస్తవం : అజాగ్రత్తగా ఉన్న డాక్టరు మాత్రమే కాదు.. డ్రైవర్ కూడా డజన్ల కొద్దీ మందిని చంపగలడు. ఒక ఇంజనీర్ అజాగ్రత్త వందల మంది ప్రాణాలను తీయగలదు.

3. అపోహ : వైద్యం అనేది మానవాళికి చేసే సేవ. వైద్యులు డబ్బు వెంట పరుగెత్తకూడదు.

వాస్తవం : నేటికాలంలో డబ్బు అనేది విజయానికి ఒక కొలమానం. అలాంటప్పుడు డబ్బు వెంట పరుగెత్తడం చెడు ఎలా అవుతుంది. ఎక్కువ పని చేయడం ద్వారా ఎక్కువ డబ్బు సంపాదించడం అనేది నైతికమైన నేరం కాదు. డబ్బు వెంట పరుగెత్తొద్దని వైద్యులకు సలహాలు ఇచ్చే వారంతా డబ్బు వెంట పరుగులు తీయడం లేదా ? ఒకసారి ఆలోచించుకోవాలి.

4. అపోహ : వైద్యులు వంద శాతం నిజాయితీగా ఉండాలి.

వాస్తవం : డాక్టర్లు అంగారక గ్రహం నుంచో శుక్ర గ్రహం నుంచో ఊడిపడలేదు. న్యాయమూర్తులు, ఆర్మీ జనరల్స్‌లో కొంతమంది అవినీతికి పాల్పడుతున్నప్పుడు.. వైద్యులలో కూడా కొంతమంది అవినీతికి పాల్పడే ఛాన్స్ ఉంటుంది. రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు, లాయర్లు, పోలీసులు, ప్రభుత్వ రంగ కంపెనీల ఇంజినీర్లతో పోలిస్తే డాక్టర్లు చేసే అవినీతి చాలా చాలా తక్కువ.

5. అపోహ : వైద్యులు ఖరీదైన మందులను రాస్తుంటారు. అనవసరమైన టెస్టులను చేయిస్తుంటారు.

వాస్తవం : వైద్యం అనేది.. డాక్టర్, రోగి మధ్య ఉండే సంబంధం, కమ్యూనికేషన్ ఆధారంగా జరుగుతుంటుంది. రోగి ఒక వైద్యుడిని విశ్వసించకపోతే.. మరొక వైద్యుడి వద్దకు వెళ్లొచ్చు. మెడికల్ సైన్స్ అనేది జీవితాంతం నేర్చుకునే ప్రక్రియ. చాలావరకు వైద్య చికిత్సలు ట్రయల్ అండ్ ఎర్రర్‌ పద్ధతిపై ఆధారపడి జరుగుతుంటాయి. ఒక రోగికి పని చేసే ఔషధం.. మరొకరికి పని చేయకపోవచ్చు.

  • రెండోది.. చౌక ధరలకు నాణ్యమైన మందులను అందించే బాధ్యత వైద్యుడిది కాదు. ఆ బాధ్యత ప్రభుత్వ అధికారులది. డాక్టర్లు జనరిక్ ఔషధాలను రాయడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేస్తే.. జనరిక్ ఔషధ దుకాణాలను పెద్దసంఖ్యలో తెరిస్తే కచ్చితంగా చౌక ధరకే మందులు అందుబాటులోకి వస్తాయి. మూడోది.. రోగి ఆరోగ్యపరమైన రక్షణ కోసమే వైద్య పరీక్షలను డాక్టర్లు సిఫారసు చేస్తారు.
  • హెల్మెట్ లేదా సీట్ బెల్ట్ ధరించేే విషయంలో స్వేచ్ఛ ఎలా ఉందో.. మెడికల్ టెస్టు చేయించుకునే విషయంలో రోగులకు అంతే స్వేచ్ఛ ఉంటుంది. మెడికల్ టెస్టులు రోగికి సరైన చికిత్స అందించేందుకు మార్గం సుగమం చేస్తాయి. సాధారణంగా ఇండియాలోని వైద్యులు రోగులకు చాలా తక్కువ టెస్టులే సిఫారసు చేస్తుంటారు.

6. అపోహ : వైద్య చికిత్సల ఖర్చులు అకారణంగా పెరుగుతున్నాయి.

వాస్తవం : ఇతర ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దేశంలో వైద్యఖర్చులు తక్కువే. అందుకే విదేశాల వారు మనదేశానికి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకొని వెళ్తున్నారు. దీన్నే మెడికల్ టూరిజం అని కూడా పిలుస్తారు. కొత్తగా అందుబాటులోకి వస్తున్న వైద్య సాంకేతికత చికిత్సల ఖర్చులను చాలావరకు తగ్గిస్తోంది.

7.అపోహ : వైద్యులు దేవుడి తర్వాత దేవుడి లాంటివారు

వాస్తవం : వైద్యులు కూడా ఇతరులలాగా మనుషులే. వారు కూడా అలసిపోతారు. అనారోగ్యానికి గురవుతారు. కుటుంబ బాధ్యతలను కలిగి ఉంటారు. కొన్నిసార్లు డాక్టర్లు కూడా కలత చెందుతారు. ఒత్తిడికి గురవుతారు. సగటు మానవుడికి ఉండే అన్ని బలహీనతలు డాక్టర్లలో కూడా ఉంటాయి. ఒకవేళ ఎవరైనా డాక్టరు భగవంతుడిలా ఆదరించబడాలని కోరుకుంటే.. అలాంటివారు ఆలయానికి షిఫ్టు అయితే బెటర్.


Next Story