సమాజంలోని ప్రతి వ్యక్తీ జీవితంలో మార్పునకు హామీ: ప్రధాని మోడీ

by Dishanational1 |
సమాజంలోని ప్రతి వ్యక్తీ జీవితంలో మార్పునకు హామీ: ప్రధాని మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: అభివృద్ధి దిశగా ప్రయాణిస్తున్న భారత్‌కు ఇది అద్భుతమైన సందర్భమని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్ నినాదాన్ని ప్రస్తావించిన మోడీ, 'సమాజంలోని చివరి వ్యక్తి జీవితంలోనూ మార్పు తీసుకురావడం మోడీ గ్యారెంటీ. అందుకే దేశంలో ఓవైపు దేవాలయాలు, మరోవైపు కోట్లాది మంది పేదలకు శాశ్వత ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. నేడు దేశం సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్ మంత్రంపై పరుగులు పెడుతోందని' అన్నారు. గురువారం గుజరాత్‌లోని మెహసానాలో జరిగిన సభలో పాల్గొన మోడీ, జిల్లాలో పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. నేడు నూతన భారతంలో చేస్తున్న ప్రతి ప్రయత్నం భవిష్యత్తు తరాలకు వారసత్వాన్ని సృష్టిస్తోంది. నిర్మించబడుతున్న కొత్త, ఆధునిక రోడ్లు, రైల్వే ట్రాక్‌లు అభివృద్ధి చెందిన దేశానికి బాటలని మోడీ అభిప్రాయపడ్డారు.

అలాగే, దక్షిణ గుజరాత్‌లోని నవ్‌సారీలో జరిగిన సభలో ప్రసంగించిన మోడీ కాంగ్రెస్‌పై విమర్శలతో విరుచుకుపడ్డారు. తన కులం గురించి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మోడీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి తనను నిందించడమే పనిగా ఉందని, మరో ఎజెండా వారికి లేదని విమర్శించారు. దీనివల్ల వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు 400 కంటే ఎక్కువ సీట్లను గెలించేందుకు బలాన్నిస్తాయని అన్నారు. కాంగ్రెస్‌కు దేశం కోసం చేయడానికి ఎలాంటి అజెండా లేని, తనను లక్ష్యంగా చేసుకుని విమర్శించడమేనని అన్నారు. వారు ఎంత బురద విసిరితే అంతే వేగంగా 370 కమలాలు(బీజేపీ సొంతంగా గెలుస్తుందనే సీట్ల అంచనాను ప్రస్తావిస్తూ) వికసిస్తాయని మోడీ పేర్కొన్నారు. బంధుప్రీతి, బుజ్జగింపులు, అవినీతి రాజకీయాలు లక్ష్యంగా పనిచేస్తే దేశ వారసత్వాన్ని కాపాడటంతో శ్రద్ధ లోపిస్తుందని మోడీ కాంగ్రెస్‌ను ఉద్దేశించి ఆరోపించారు.


Next Story