లంచగొండి ఎంపీలు, ఎమ్మెల్యేలకు షాక్.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

by Dishanational4 |
లంచగొండి ఎంపీలు, ఎమ్మెల్యేలకు షాక్.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
X

దిశ, నేషనల్ బ్యూరో : చట్టసభల్లో ప్రసంగించేందుకు, ప్రశ్నలు అడిగేందుకు, ఓటు వేయడానికి లంచం పుచ్చుకునే ఎంపీలు, ఎమ్మెల్యేలు విచారణను ఎదుర్కోవాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ముడుపుల కేసుల్లో చట్టసభల సభ్యులకు ఎలాంటి మినహాయింపూ ఉండదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా తేల్చి చెప్పింది. ఎంపీ, ఎమ్మెల్యేలకు లంచం కేసుల్లో రాజ్యాంగ రక్షణ కల్పించడంపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. చట్టసభల సభ్యులకు లంచం కేసుల్లో రాజ్యాంగపరమైన రక్షణను కల్పిస్తూ, విచారణ నుంచి మినహాయిస్తూ 1998లో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. ‘‘లంచంతో ముడిపడిన వ్యవహారాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్లమెంటరీ అధికారాల ద్వారా రక్షణ పొందలేరు. 1998 నాటి సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగంలోని 105, 194 అధికరణలకు విరుద్ధం’’ అని సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌ కామెంట్ చేశారు. ప్రజా జీవితంలో ఉన్నవారి విశ్వసనీయతను లంచం దెబ్బతీస్తుందని, దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించలేమని ఆయన పేర్కొన్నారు.

జేఎంఎం ఎమ్మెల్యే సీతా సోరెన్‌ వ్యవహారంలో..

2012 సంవత్సరంలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో జేఎంఎం ఎమ్మెల్యే సీతా సోరెన్‌ ఒక పార్టీ అభ్యర్థికి ఓటు వేయడానికి లంచం పుచ్చుకొని మరొకరికి ఓటు వేశారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై అప్పట్లో సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ క్రిమినల్‌ కేసును కొట్టివేయాలని కోరుతూ ఆమె తొలుత జార్ఖండ్‌ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించడంతో సీతా సోరెన్‌ చివరగా సుప్రీంను ఆశ్రయించారు. దీనిపై 2019లో అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడినప్పుడు వారిపై చర్యలు తీసుకోవచ్చా? లేదా ? అనే అంశం ఎంతో ముఖ్యమైనదని ధర్మాసనం తెలిపింది. దానిపై విచారణ చేయాలని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి సిఫార్సు చేసింది. అనంతరం ఈ కేసును సుప్రీంకోర్టు సీజేఐ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారించి తాజా తీర్పును వెలువరించింది.

పీవీ నరసింహారావు.. నలుగురు ఎంపీలు.. ఏమైంది ?

1993లో అప్పటి ప్రధానమంత్రి పీవీ నరసింహారావు ప్రభుత్వం అవిశ్వాస పరీక్షను ఎదుర్కొంది. ఆ సమయంలో జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) ఎంపీగా ఉన్న శిబూ సోరెన్‌ సహా ఆ పార్టీకి చెందిన మరో నలుగురు ఎంపీలు లంచాలు తీసుకుని అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేశారనే ఆరోపణలు వచ్చాయి. వీరి మద్దతు కారణంగా మైనార్టీలో ఉన్నప్పటికీ పీవీ నరసింహారావు ప్రభుత్వం గట్టెక్కింది. ఆ తర్వాత సోరెన్‌ సహా ఐదుగురు ఎంపీలపై సీబీఐ కేసును నమోదు చేసింది. ఈ కేసు చివరకు సుప్రీంకోర్టుకు చేరడంతో సదరు జేఎంఎం ఎంపీలకు ఊరటనిచ్చేలా తీర్పు వచ్చింది. ప్రజాప్రతినిధులకు లంచం కేసుల విచారణ నుంచి మినహాయింపునిస్తూ 1998లో అప్పటి సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పును వెలువరించింది.

ప్రధాని మోడీ ఏమన్నారంటే..

ఎంపీ, ఎమ్మెల్యేల లంచం కేసులపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రధాని మోడీ స్పందించారు. ఈ తీర్పు స్వచ్ఛమైన రాజకీయాలకు బాటలు వేస్తుందని, వ్యవస్థపై ప్రజలకు విశ్వాసాన్ని పెంపొందిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈమేరకు ప్రధాని ఒక ట్వీట్ చేశారు.


Next Story