అర్ధరాత్రి సెర్చ్ ఆపరేషన్.. 100 మందికి పైగా అగ్రనేతల అరెస్ట్

by Disha Web Desk |
అర్ధరాత్రి సెర్చ్ ఆపరేషన్.. 100 మందికి పైగా అగ్రనేతల అరెస్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశవ్యాప్తంగా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) డొంక కదులుతోంది. గురువారం దేశవ్యాప్తంగా పీఎఫ్ఐ కార్యాలయాలు, సభ్యుల ఇళ్లపై ఏకకాలంలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ), ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు చేపట్టింది. తెలంగాణతో సహా ఆంధ్రప్రదేశ్, బీహార్, కేరళ, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, కర్నాటకలో ఎన్ఐఏ, ఈడీ, రాష్ట్ర పోలీసులు సమన్వయంతో జాయింట్ ఆపరేషన్ కొనసాగుతోంది. దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు నిధుల, తీవ్రవాద భావజాలం వ్యాప్తి, ఉగ్రవాద శిక్షణ వంటి ఆరోపణలపై ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ తెల్లవారుజామున దేశవ్యాప్తంగా జరిగిన దాడుల్లో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్‌ఐ)కి చెందిన 100 మందికి పైగా అగ్రనేతలు మరియు కార్యకర్తలను అరెస్టు చేశారు. ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం, శిక్షణ శిబిరాలు నిర్వహించడం మరియు నిషేధించబడిన సంస్థలలో చేరడానికి వ్యక్తులను ప్రోత్సహించడం వంటి అంశాలపై ఆరా తీస్తున్నారు.

ఉగ్రవాద మూలాలు, శిక్షణ వంటి వ్యవహారాలు పెద్ద ఎత్తున దేశంలో బయటపడటంతో పీఎఫ్ఐ పై హోమ్ శాఖ దృష్టి సారించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ స్వయంగా ఈ మొత్తం ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. సుమారు 40 ప్రదేశాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఎన్ఐఏ చరిత్రలో అతి పెద్ద దర్యాప్తుగా దీనిని చెబుతున్నారు. మొత్తం 200 మందికి పైగా ఏన్ఐఏ అధికారులు, ఇతర సిబ్బంది ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారు. మొత్తం పదికి పైగా రాష్ట్రాల్లో అరెస్టులు కొనసాగాయి. అయితే ఎన్ఐఏకు వ్యతిరేకంగా కర్ణాటకలో ఆందోళన చేస్తున్న పీఎఫ్ఐ, ఎస్ డీపీఐ సభ్యులను మంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. కేరళలోని మల్లపురం జిల్లా మంజేరిలోని పీఎఫ్ఐ చైర్మన్ సలాం ఇంటిపై అర్థరాత్రి నుంచి ఎన్ఐఏ తనిఖీలు మొదలు పెట్టింది.

చాంద్రాయణ గుట్ట ఆఫీస్ సీజ్

రెండు రోజుల క్రితం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో సోదాలు చేసిన ఎన్ఐఏ నిజామాబాద్, నెల్లూరు జిల్లాలో పలువురిని అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌లో ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం మరోసారి తెలుగు రాష్ట్రాల్లో సోదాలు చేపట్టింది. హైదరాబాద్ చాంద్రాయణ గుట్టలోని పీఎఫ్ఐ హెడ్ ఆఫీస్‌లో తనిఖీలు చేసి హార్డ్ డిస్క్ లు, పెన్ డ్రైవ్ లు, పత్రాలు స్వాధీనం చేసుకుని ఆఫీస్ ను సీజ్ చేశారు. విచారణకు రావాలని నిర్వాహకులను అధికారులు ఆదేశించారు. అలాగే ఉప్పల్, ఘట్ కేసర్, కరీంనగర్ లోని 8 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేపట్టారు. ఏపీలోని కర్నూల్, గుంటూరులోని ఆటోనగర్‌లో తనిఖీలు చేస్తున్నారు. దర్యాప్తులో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా రాజకీయ పార్టీ ఉగ్ర బాగోతంపై తీవ్ర చర్చ జరుగుతోంది.

Next Story