లక్షా 49 వేల కోట్లకు ఆయుష్ మార్కెట్.. రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రశ్నకు కేంద్రం జవాబు

by Dishafeatures2 |
లక్షా 49 వేల కోట్లకు ఆయుష్ మార్కెట్.. రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రశ్నకు కేంద్రం జవాబు
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో ఆయుష్ పరిశ్రమ మార్కెట్ సైజు ఒక లక్షా 49 వేల 451 కోట్ల రూపాయలకు చేరిందని ఆయుష్ శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్ వెల్లడించారు. రాజ్యసభలో మంగళవారం వైసీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాత పూర్వకంగా సమాధానమిచ్చారు. భారతీయ సాంప్రదాయ వైద్య వేదిక (ఫోరం ఆన్ ఇండియన్ ట్రెడిషనల్ మెడిసిన్) ఆయుష్ రంగంపై జరిపిన పరిశోధనా నివేదిక ప్రకారం 2014-15లో 23 వేల 532 కోట్లు ఉన్న ఆయుష్ మార్కెట్ 2020 నాటికి ఒక లక్షా 49 వేల 451 కోట్ల రూపాయలకు చేరుకున్నట్లు స్పష్టం చేశారు. ఆయుష్ రంగంలో అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించేందుకు ఆయుష్ మంత్రిత్వ శాఖ ఒక పథకాన్ని రూపొందించింది. అందులో భాగంగా భారతీయ ఆయుష్ తయారీదారులు, సర్వీస్ ప్రొవైడర్లు తమ ఎగుమతులను మరింత వృద్ధి చేసుకునేందుకు వీలుగా పలు రకాల చర్యలు చేపడుతోందని వెల్లడించారు.

వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ సహకారంతో ఆయుర్వేద, యునాని, సిద్ధ, హోమియోపతి, సోవా రిగ్పా వైద్య విధానాలకు సంబంధించిన మందులు ఇతర ఉత్పాదనల ఎగుమతుల కోసం ఆయుష్‌ ఎక్స్‌పోర్ట్‌ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసినట్లు కేంద్రం తెలిపింది. అలాగే ఆయుష్ వైద్య విధానాన్ని అంతర్జాతీయంగా ప్రోత్సహించేందుకు వేర్వేరు దేశాలతో 24 ఒప్పందాలను కుదుర్చుకోవడం జరిగిందని..ఆయుష్‌ విధానాలపై పరిశోధనలు, అధ్యయనంపై సహకారం కోసం వివిధ అంతర్జాతీయ సంస్థలతో 40 ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. అలాగే ఆయుష్ అకడమిక్ చైర్స్ నెలకొల్పేందుకు 15 ఎంవోయూలు కుదుర్చుకున్నట్లు తెలిపింది. అంతేకాదు 35 దేశాలలో ఆయుష్ సమాచార కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ఆయుష్‌ మంత్రిత్వ శాఖ 39 ఎంఓయూలను కుదుర్చుకుందని పేర్కొన్నారు. వీటితోపాటు31 ఆయుర్వేద డ్రగ్ మాన్యుఫ్యాక్చరర్స్ ఆయుర్వేద, సిద్ధ, యునాని, హోమియో మందులను ఎగుమతి చేసుకునేందుకు డబ్ల్యుహెచ్ఓ-జీఎంపీ అందించినట్లు ఆయుష్ శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్ తెలిపారు.

Next Story

Most Viewed