రూ. 1,100 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు

by Dishanational1 |
రూ. 1,100 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలోని పూణె పోలీసులు భారీ మొత్తంలో డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. రూ. 1,100 కోట్ల విలువైన 600 కిలోల మెఫెడ్రోన్‌ను సీజ్ చేసి, ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు నగర పోలీసు కమిషనర్ మంగళవారం వెల్లడించారు. పూణె జిల్లాలో అతిపెద్ద డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న కేసులో ముగ్గురిపైనా వివిధ సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేశామని తెలిపారు. పోలీసు కమిషనర్ అమితేష్ కుమార్ వెల్లడించిన దాని ప్రకారం, 'ఆదివారం ముగ్గురిని అరెస్ట్ చేశాం. వారి నుంచి రూ. 3.85 కోట్ల విలువ 1.75 కిలోల మెఫెడ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నాం. విచారణలో మరో 55 కిలోల మెఫెడ్రోన్‌ను గుర్తించాం. ఆ తర్వాత అరెస్ట్ అయిన ముగ్గురి నుంచి వచ్చిన సమాచారం ఆధారంతో ఆపరేషన్ నిర్వహించి ఎంఐడీసీ ప్రాంతంలో 550 కిలోల డ్రగ్స్‌ను సీజ్ చేశామని' ఆయన వివరించారు. ఇప్పటివరకు 660 కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నాం. వీటి విలువ సుమారు రూ. 1,100 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నట్టు అమితేష్ కుమార్ చెప్పారు. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తును వివిధ కోణాల్లో చేపడుతున్నాం. పోలీసులు, ఏజెన్సీలు సమన్వయంతో పనిచేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. అరెస్ట్ అయిన నిందితుల గురించి, వారు 'కొరియర్ బాయ్స్' గా పనిచేస్తున్నారని, వారిపై ఇప్పటికే కొన్ని నేరాలు నమోదయ్యాయన్నారు. విచారణ ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని, మరిన్ని వివరాలను తర్వాత వెల్లడించనున్నట్టు పోలీసు కమిషనర్ స్పష్టం చేశారు.


Next Story

Most Viewed