మణిపూర్ హింస వ్యవహారంలో వివాదాస్పద పేరాను తొలగించిన హైకోర్టు

by Dishanational1 |
మణిపూర్ హింస వ్యవహారంలో వివాదాస్పద పేరాను తొలగించిన హైకోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: మణిపూర్‌లో కుకీ, మెయితీల మధ్య చెలరేగిన హింసకు సంబంధించి గతేడాది ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సవరించింది. మెయితీలను షెడ్యూల్స్ ట్రైబ్స్(ఎస్టీ) జాబితాలో చేర్చాలనే అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన ఆదేశాలను తొలగించింది. గిరిజనులను జాబితాలో చేర్చడం, మినహాయించడం అనే ప్రక్రియలను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చేపడుతుందని కోర్టు పేర్కొంది. ఈ ఉత్తర్వులకు సంబంధించి గతేడాది కుకీ తెగ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టు సైతం ప్రశ్నించింది. ఎస్టీ జాబితాను కోర్టులు సవరించడం, మార్పులు చేయడం కుదరదని పేర్కొంది. ఈ బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి చెందినదని స్పష్టం చేసింది. మెయితీలకు రిజర్వేషన్లు ఇవ్వాలనే అంశాన్ని పరిశీలించాలని గతేడాది కేంద్ర గిరిజన శాఖకు కోర్టు ప్రతిపాదించింది. దీనిపై నాగా, కుకీ-జోమి తెగలు రిజర్వేషన్లు ఇవ్వకూడదని డిమాండ్ చేశాయి. వారికి రిజర్వేషన్లు దక్కితే అటవీ ప్రాంతాల్లో తమ నివాసాలు, ఉద్యోగాల వాటా తగ్గిపోతాయని ఆందోళనను వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా మణిపూర్ హైకోర్టు సింగిల్ బెంచ్ ధర్మాసనం వివాదాస్పద పేరాను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధమని అభిప్రాయపడింది. గతేడాది మణిపూర్‌లో మెయితీ, కుకీల మధ్య జాతి వైరం తీవ్రస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ఆ ప్రాంతంలో శాంతి కోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేసినప్పటికీ ఏదోక మూల ఘర్షణలు చేలరేగుతూనే ఉన్నాయి. ఈ హింస కారణంగా ఇప్పటివరకు 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.


Next Story