'దేశం విడిచి వెళ్లిపోండి'.. ఇమ్రాన్‌కు పాక్ ఆర్మీ వార్నింగ్

by Disha Web Desk 13 |
దేశం విడిచి వెళ్లిపోండి.. ఇమ్రాన్‌కు పాక్ ఆర్మీ వార్నింగ్
X

ఇస్లామాబాద్: పాకిస్తాన్ లో ప్రతీకార రాజకీయాలు పతాక స్థాయికి చేరాయి. ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన ప్రతిపక్ష పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) టార్గెట్ గా ప్రధాని షహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని సంకీర్ణ సర్కారు పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే లాహోర్ లోని జమాన్ పార్క్ ప్రాంతంలో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ఇంట్లో 40 మంది ఉగ్రవాదులు తలదాచుకున్నారంటూ పంజాబ్ ప్రావిన్స్ ప్రభుత్వం ఆరోపించింది. వారిని 24 గంటల్లోగా సరెండర్ చేయాలని ఇమ్రాన్ ఖాన్ ను బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఆదేశించింది. ఇమ్రాన్ ఖాన్‌ను మళ్లీ అరెస్ట్ చేస్తే, ఈ ఉగ్రవాదులు రంగంలోకి దిగి విధ్వంసం సృష్టించే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది.

మరోవైపు ఈ పరిణామాలపై ఇమ్రాన్ స్పందించారు. జమాన్ పార్క్ ప్రాంతంలో ఉన్న తన ఇంట్లోకి మీడియా ప్రతినిధులను తీసుకెళ్లి.. ఉగ్రవాదులు ఎవరూ లేరని చూపించారు. ప్రస్తుతం పాకిస్తాన్.. బంగ్లాదేశ్ తరహా పరిస్థితిని ఎదుర్కొంటోందని, విపత్తు దిశగా వెళ్తోందని కామెంట్ చేశారు. తాను సైన్యంపై చేసిన విమర్శలను తండ్రి.. కొడుకులను మందలించిన విధంగా చూడాలన్నారు. ప్రభుత్వ అంతర్గత విషయాల్లో సైన్యం జోక్యం చేసుకోవద్దని మరోసారి సూచించారు. సైన్యాన్ని.. తమ పార్టీకి వ్యతిరేకంగా ఉంచడానికి అధికార పార్టీ కుట్ర పన్నిందని ఇమ్రాన్ ఆరోపించారు. ఎన్నికల నిర్వహణే పాకిస్తాన్ సమస్యకు పరిష్కారమని పేర్కొన్నారు.

ఆర్మీ వార్నింగ్.. ఇమ్రాన్ కౌంటర్..

"దేశం విడిచి వెళ్లిపోండి. లేదంటే ఫలితం అనుభవిస్తారు. ఆర్మీ యాక్ట్ కింద కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. దుబాయ్‌ లేదా లండన్‌కు వెళ్లిపోండి. దేశం విడిచి వెళ్లిపోతే ఎలాంటి కేసు నమోదు చేయం" అంటూ ఇమ్రాన్‌కు పాక్ ఆర్మీ వార్నింగ్ ఇచ్చింది. మళ్లీ అల్లర్లకు పాల్పడాలని ప్రయత్నిస్తే దేనికైనా తెగిస్తామని పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్.. ఇమ్రాన్ మద్దతుదారులకు వార్నింగ్ ఇచ్చారు. ఆర్మీ వార్నింగ్‌పై ఇమ్రాన్ స్పందించారు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా తాను దేశం విడిచిపారిపోనని, తుది శ్వాస విడిచే వరకు ఇక్కడే ఉంటానని స్పష్టం చేశారు. ఇటీవల ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్‌ చేసిన వ్యవహారంపై ఆ దేశ సుప్రీంకోర్టు గురువారం విచారణ చేపట్టింది.

ఈ క్రమంలో పాక్ సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ ఉమర్ అతా బందియాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. "ఓ వ్యక్తి కోర్టులో హాజరయ్యారంటేనే చట్టపరంగా అన్ని నిబంధనలు పాటిస్తున్నట్టు లెక్క. అలాంటి వ్యక్తిని కోర్టులోనే అరెస్ట్ చేయడంలో అర్థమేంటి..? భవిష్యత్‌లో ఇంకెవరైనా కోర్టుకి రావాలన్నా భయపడతారు. అక్కడా భద్రతా లేదని భావిస్తారు. అరెస్ట్ చేసే ముందు పోలీసులు రిజిస్ట్రార్ అనుమతి తీసుకోవాలి" అని పేర్కొన్నారు.

Also Read..

ఒరిస్సాలో వందే భారత్ ఎక్స్ ప్రెస్ను ప్రారంభించిన పీఎం మోడీ



Next Story

Most Viewed