కుల గణనతో దేశాన్ని ఎక్స్‌రే తీస్తాం: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ

by samatah |
కుల గణనతో దేశాన్ని ఎక్స్‌రే తీస్తాం: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ
X

దిశ, నేషనల్ బ్యూరో: కుల గణన ద్వారా దేశాన్ని ఎక్స్ రే తీస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. దేశంలో సమానత్వం కోసమే కులగణన చేస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు అదానీ, అంబానీల నుంచి నగదు అందుతుందన్న మోడీ వ్యాఖ్యలపై స్పందించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘బీజేపీ గత పదేళ్లుగా బిలియనీర్ల నుంచి పొందిన నోట్లను లెక్కించడంలో బిజీగా ఉంది. కానీ మేము అధికారంలోకి వస్తే దేశంలో కులగణన నిర్వహిస్తాం. ప్రతి వర్గానికి సమాన వాటా అందజేస్తాం’ అని పేర్కొన్నారు. అదానీ, అంబానీ తమకు నల్లధనం పంపారా అనే దానిపై సీబీఐ లేదా ఈడీ దర్యాప్తునకు ప్రధాని ఆదేశించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కాగా, కులాలు, ఉపకులాలు వారి సామాజిక-ఆర్థిక పరిస్థితులను లెక్కించడానికి దేశవ్యాప్తంగా సామాజిక-ఆర్థిక, కుల గణనను నిర్వహిస్తామని పార్టీ తన మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.Next Story