ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం: ఐఎండీ

by Dishanational1 |
ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం: ఐఎండీ
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు అవుతుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనా వేసింది. దీర్ఘకాల సగటు(87 సెమీమీటర్ల)తో పోలిస్తే వచ్చే ఋతుపవనాల సీజన్‌లో 106 శాతం వర్షపాతం నమోదు కావొచ్చని అభిప్రాయపడింది. లా నినా పరిస్థితులు వర్షాలకు అనుకూలంగా ఉండటంతో ఈ ఏడాది ఆగష్టు-సెప్టెంబర్ నాటికి ఎక్కువ వర్షపాతం ఉంటుందని ఐఎండీ పేర్కొంది. వాయువ్య, తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలు మినహా దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాలు సాధారణం కంట్ ఎక్కువ వర్షపాతాన్ని చూడవచ్చు. 1951 నుంచి 2023 మధ్య ఎల్ నినో తర్వాత లా నినా వచ్చిన సందర్భాల్లో భారత్‌లో తొమ్మిది సార్లు సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందని ఐఎండీ వెల్లడించింది. వర్షం పడే రోజుల సంఖ్య తగ్గుతోందని, అయితే, భారీ వర్షాలు పెరుగుతున్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది తరచుగా కరువు, వరదలకు దారితీస్తుందని వారు పేర్కొన్నారు.



Next Story

Most Viewed