ప్రజాస్వామ్య రక్షణకు మార్చి 31న ఇండియా కూటమి 'మహా ర్యాలీ'

by Dishanational1 |
ప్రజాస్వామ్య రక్షణకు మార్చి 31న ఇండియా కూటమి మహా ర్యాలీ
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశ ప్రయోజనాలను, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ప్రతిపక్ష ఇండియా కూటమి ఈ నెలాఖరు 31న ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో 'మహా ర్యాలీ'ని నిర్వహించనున్నట్టు యాప్ నేత గోపాల్ రాయ్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. గతవారం ఎక్సైజ్ పాలసీకి సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో మార్చి 28 వరకు ఈడీ కస్టడీకి కోర్టు శుక్రవారం అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలో అధికార బీజేపీ అనుసరిస్తున్న అప్రజాస్వామిక తీరును నిరసిస్తూ ఇండియా కూటమి పక్షాలు ఆప్, కాంగ్రెస్ ర్యాలీని ప్రకటించాయి. 'దేశంలో రాజకీయ పార్టీల పట్ల జరుగుతున్న బెదిరింపు ధోరణులకు వ్యతిరేకంగా మార్చి 31న రామ్‌లీలా మైదానంలో ర్యాలీని చేపడతాం. ఈ కార్యక్రమంలో ఇండియా కూటమి అగ్ర నాయకత్వం పాల్గొంటుందని ' ఆప్ ఢిల్లీ కన్వీనర్ గోపాల్ రాయ్ తెలిపారు. ప్రజాస్వామ్యం, దేశం రెండూ ప్రమాదంలో ఉన్నాయి. వాటి రక్షణకు అన్ని ఇండియా కూటమి పార్టీలు ర్యాలీలో పాల్గొంటాయన్నారు. పార్టీ ఖాతాలను స్తంభింపజేయడం, ముఖ్యమంత్రిని సైతం అరెస్ట్ చేయడం ద్వారా బీజేపీ ప్రతిపక్ష పార్టీలకు అడుగడుగున ఇబ్బందులు సృష్టిస్తోందని కాంగ్రెస్ ఢిల్లీ యూనిట్ చీఫ్ అరవిందర్ సింగ్ లవ్లీ ఆరోపణలు చేశారు. మహా ర్యాలీ రాజకీయంగా మాత్రమే కాకుండా దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు, బీజేపీ నేతృత్వంలోని కేంద్రానికి వ్యతిరేకంగా గళం వినిపించేందుకు పిలుపునిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.


Next Story