‘ఇండియా’కు ప్రధాని మొహం అక్కర్లేదన్న కీలక నేత

by Dishanational4 |
‘ఇండియా’కు ప్రధాని మొహం అక్కర్లేదన్న కీలక నేత
X

దిశ, నేషనల్ బ్యూరో : ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’కు ప్రధానమంత్రి అభ్యర్ధి అక్కర్లేదని, కూటమి పేరుతో ఓట్లు అడిగితే సరిపోతుందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ అన్నారు. దేశానికి సరైన ప్రత్యామ్నాయాన్ని అందించగలమనే అంశాన్ని జనంలోకి తీసుకెళ్తే సరిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘1977 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్ధి ఎవరో ప్రకటించకుండానే విపక్షాలు పోటీ చేశాయి. చివరకు గెలిచాక జనతా పార్టీ గొడుగు కింద మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి అయ్యారు’’ అని శరద్ పవార్ గుర్తు చేశారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేను ఇండియా కూటమి ఛైర్‌పర్సన్‌గా ఎన్నుకోవడంపై పవార్ మాట్లాడుతూ.. ‘‘కొందరు నాయకులు ఖర్గేను కూటమి చైర్‌పర్సన్‌గా నియమించాలని సూచించారు. చాలా మంది దానికి అంగీకరించారు.. నితీష్ కుమార్ పేరును కూడా చాలా మంది సూచించారు. అయితే నితీష్ కుమార్ పోటీ నుంచి వైదొలిగారు’’ అని వెల్లడించారు. సీట్ల పంపకాల విషయంలో కూటమిలోని పార్టీల మధ్య ఎలాంటి అసంతృప్తి లేదని ఆయన స్పష్టం చేశారు. సీట్ల పంపకంపై మిగతా పార్టీలతోనూ త్వరలోనే చర్చలు ప్రారంభించి, నిర్ణయం తీసుకుంటామన్నారు. ‘‘రామ మందిరానికి ఎవరూ వ్యతిరేకం కాదు.. బీజేపీ రాజకీయాలు చేస్తోందనే ఉద్దేశంతోనే చాలాపార్టీలు జనవరి 22న అయోధ్య కార్యక్రమానికి వెళ్లడం లేదు’’ అని చెప్పారు.

Next Story

Most Viewed