లోక్‌సభ ఎన్నికల బరిలో రాబర్ట్ వాద్రా.. ఎక్కడి నుంచో తెలుసా ?

by Dishanational4 |
లోక్‌సభ ఎన్నికల బరిలో రాబర్ట్ వాద్రా.. ఎక్కడి నుంచో తెలుసా ?
X

దిశ, నేషనల్ బ్యూరో : కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రా తన రాజకీయ అరంగేట్రంపై కీలక వ్యాఖ్య చేశారు. ‘‘ఎన్నికల్లో పోటీ చేసే ఆసక్తి ఉంటే.. నన్ను ఎంపీ చేయాలని ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ లోక్‌సభ నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారు.. వాళ్ల ఆకాంక్ష నెరవేరుతుందని ఆశిస్తున్నాను’’ అని ఆయన పేర్కొన్నారు. గురువారం సాయంత్రం ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ రాబర్ట్ వాద్రా ఈ కామెంట్ చేశారు. ‘‘గాంధీ కుటుంబం యూపీలోని రాయ్‌బరేలీ, అమేథీ, సుల్తాన్‌పూర్‌లకు విశేష సేవలు అందించింది. కానీ ప్రస్తుత బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వల్ల అమేథీ తల్లడిల్లుతోంది. ఆమెను ఎన్నుకొని తప్పు చేశామని అమేథీ ప్రజలు బాధపడుతున్నారు’’ అని ఆయన తెలిపారు. అందుకే తనకు ఈసారి అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో అక్కడి ప్రజానీకం ఉన్నారని చెప్పారు. ఐదో దశ పోలింగ్‌లో భాగంగా మే 20న అమేథీలో ఓటింగ్ జరగబోతోంది. జూన్ 4న ఫలితాలు వెలువడుతాయి.

కాంగ్రెస్ అమేథీ అభ్యర్థి?

యూపీలోని 17 స్థానాల్లో ఈసారి కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తోంది. ఆ పార్టీ ఇప్పటి వరకు 14 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అమేథీ, రాయ్‌బరేలీ అభ్యర్థులు ఎవరనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. రాయ్‌బరేలీ అనేది సోనియాగాంధీ సిట్టింగ్ లోక్‌సభ స్థానం. ఆమె ఇటీవల రాజస్థాన్ నుంచి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. దీంతో ఖాళీ అయిన రాయ్‌బరేలీ స్థానం నుంచి ప్రియాంకాగాంధీ పోటీ చేయనున్నారని తెలుస్తోంది. ఇక అమేథీ స్థానం నుంచి గత ఎన్నికల్లో రాహుల్ గాంధీ పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పటికే రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ లోక్‌సభ సీటు నుంచి నామినేషన్ వేశారు. ఈనేపథ్యంలో అమేథీ టికెట్ రాబర్ట్ వాద్రాకు దక్కే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

Next Story