ఎన్నికల విరాళాలపై స్వయంగా వివరాలు వెల్లడించిన కిరణ్ మజుందార్ షా

by Dishanational1 |
ఎన్నికల విరాళాలపై స్వయంగా వివరాలు వెల్లడించిన కిరణ్ మజుందార్ షా
X

దిశ, నేషనల్ బ్యూరో: బెంగళూరుకు చెందిన ప్రముఖ బయోఫార్మాస్యూటికల్స్ సంస్థ పేరున ఎలాంటి ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేయలేదని సంస్థ ఛైర్‌పర్సన్ కిరణ్ మజుందార్ షా వెల్లడించారు. సంస్థ పేరును ఉపయోగించి ఏ రాజకీయ పార్టీకి ఎలాంటి విరాళాలు ఇవ్వలేదని ఆమె సోమవారం ప్రకటనలో తెలిపారు. అయితే, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ నేతృత్వంలోని జనతాదళ్(సెక్యులర్)తో సహా పలు పార్టీలకు వ్యక్తిగతంగా విరాళాలు ఇచ్చేందుకు ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసినట్టు ఆమె స్పష్టం చేశారు. 'ఏ పార్టీకైనా బయోకాన్ తరపున ఎలాంటి రాజకీయ విరాళం ఇవ్వలేదని సూటిగా చెప్పగలను. వ్యక్తిగతంగా చేసిన విరాళం కూడా నామమాత్రమేనని, ఎన్నికల ప్రచారం కోసం చట్టబద్ధమైన విధానంలోనే నిధులు సమకూర్చాలనే ఉద్దేశ్యంతో చేసినవని' ఆమె వివరించారు. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేశారు. గతేడాది జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు కిరణ్ మజుందార్ షా ప్రతి నెలా రూ. 5 కోట్ల విరాళం ఇచ్చారని ఓ వ్యక్తి ట్వీట్ చేశాడు. దీనికి స్పందించిన షా, మీ లెక్క తప్పింది, సరిగా లెక్కేయండి అన్నారు. మరో యూజర్ ఆమె మొత్తం రూ. 6 కోట్లు ఇచ్చారని చెబుతూనే, ఇతర మాధ్యమాల రూపంలో ఇచ్చిన వివరాలు చెప్పండని అడిగాడు. దీనిపై, తాను ఎప్పుడూ పారదర్శకంగానే ఉంటాను. మీకు తెలిసింది మాత్రమే నిజమని పేర్కొన్నారు. కాగా, 2018 నుంచి ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ ద్వారా రాజకీయ పార్టీలు నగదును పొందిన వివరాలను ఇటీవలే ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో ఉంచింది. ఇందులో కేంద్రంలో అధికార బీజేపీ రూ. 8,718.5 కోట్లతో అగ్రస్థానంలో ఉంది. కాంగ్రెస్ రూ. 1,864.5 కోట్లతో తర్వాతి స్థానంలో ఉంది.


Next Story