సామాన్యుల కష్టాలు చూసి చలించిపోయా : సుప్రీంకోర్టు జడ్జి

by Dishanational4 |
సామాన్యుల కష్టాలు చూసి చలించిపోయా : సుప్రీంకోర్టు జడ్జి
X

దిశ, నేషనల్ బ్యూరో : రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదించి పంపిన బిల్లులను గవర్నర్లు పెండింగ్‌లో ఉంచడమనేది ఆరోగ్యకరమైన ట్రెండ్ కాదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న అభిప్రాయపడ్డారు. బిల్లులను ఆమోదించకుండా మొండిగా వ్యవహరిస్తూ గవర్నర్లు న్యాయపోరాటంలో కూరుకుపోవడం సరికాదన్నారు. ‘‘రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్లు రాజ్యాంగం ప్రకారమే నడుచుకోవాలి. ఒక పనిని చేయమని, చేయొద్దని చెప్పించుకునే రీతిలో వాళ్ల నిర్ణయాలు ఉండకూడదు’’ అని జస్టిస్ బీవీ నాగరత్న పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదస్సులో ఆమె ప్రసంగించారు. ‘‘ప్రత్యేక పరిస్థితుల్లో ఒక మహిళ గర్భస్రావానికి కోర్టులు అనుమతి ఇవ్వడమనేది చాలా క్లిష్టమైన అంశం. పలు అంశాలు అబార్షన్ సంబంధిత హక్కుల సమస్యకు దారితీస్తుంటాయి’’ అని జస్టిస్ బీవీ నాగరత్న అభిప్రాయపడ్డారు. ‘‘కేంద్ర ప్రభుత్వం అమలుచేసిన పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వల్ల సామాన్య ప్రజలు పడిన కష్టాలను చూసి నేను చలించిపోయాను. దానికి సంబంధించిన ఓ కేసును విచారించిన సుప్రీంకోర్టు బెంచ్‌లో నేను కూడా ఉన్నందుకు సంతోషంగా ఉంది’’ ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భారత సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఎస్ రవీంద్ర భట్, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధే, నేపాల్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి సపనా మల్లా, పాకిస్థాన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి సయ్యద్ మన్సూర్ అలీ షా తదితరులు మాట్లాడారు.

Next Story

Most Viewed