ఎలక్టోరల్ బాండ్స్‌తోనే ప్రభుత్వాలను పడగొట్టారు: బీజేపీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఫైర్

by Dishanational2 |
ఎలక్టోరల్ బాండ్స్‌తోనే ప్రభుత్వాలను పడగొట్టారు: బీజేపీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఫైర్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఎలక్టోరల్ బాండ్స్ పథకం ప్రభుత్వాలను పడగొట్టడానికి, పార్టీలను విచ్ఛిన్నం చేయడానికి ఉపయోగించారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఈ స్కీమ్ ప్రపంచంలోనే అతిపెద్ద దోపిడీ రాకెట్ అని అభివర్ణించారు. నిరసన తెలిపే వారిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఆదాయపు పన్ను శాఖలు వెంబడిస్తున్నాయని ఆరోపించారు. భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా మహారాష్ట్రలోని థానే జిల్లా జంభాలి నాకా వద్ద నిర్వహించిన బహిరంగ సభలో రాహుల్ ప్రసంగించారు. కరోనా వైరస్‌తో ప్రజలు మరణిస్తున్నప్పుడు, వ్యాక్సిన్ తయారీ సంస్థ సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎలక్టోరల్ బాండ్ల రూపంలో ప్రధాని మోడీకి డబ్బును విరాళంగా ఇచ్చిందని ఆరోపించారు. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీలను ఎలక్టోరల్ బాండ్ల విరాళాల ద్వారానే చీల్చి వేశారని తెలిపారు. అయోధ్య రామ మందిర శంకుస్థాపన కార్యక్రమానికి సినీ తారలు, ప్రముఖ పారిశ్రామిక వేత్తలు మాత్రమే అతిథులుగా హాజరయ్యారని, పేదలు ఎవరూ లేరని గుర్తు చేశారు. ఎన్‌సీపీ (శరద్‌చంద్ర పవార్) ఎమ్మెల్యే జితేంద్ర అవద్, శివసేన (యూబీటీ) నాయకుడు కేదార్ డిఘేలు రాహుల్ యాత్రలో పాల్గొన్నారు. కాగా, భారత్ జోడో న్యాయ్ యాత్ర ఆదివారం ముంబైలో ముగియనున్నట్టు తెలుస్తోంది.

Next Story

Most Viewed